నేడు మోటారు వాహనం అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది.వ్యక్తిగత అవసరాల కోసమో, లేదంటే వ్యాపార అవసరాల కోసమో వాటిని వినియోగించడం తప్పనిసరి అయిపోయింది.1988 మోటారు వాహన చట్టం ప్రకారం అన్ని మోటారు వాహనాలకు బీమా తప్పనిసరి.కారు కొనుగోలు చేసినప్పుడు మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం.
ఎలా అంటే ఇన్సూరెన్స్ చేయిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది.కాబట్టి, కార్ల కొనుగోలుదారులు బీమా తీసుకుంటారు.
అయితే, ఈ వాహనాలకు సమగ్ర బీమా సరిపోతుందా లేక అదనపు యాడ్-ఆన్స్ అవసరం పడతాయా అనేది చాలామందికి తెలియదు.
అందుకే ఈ యాడ్-ఆన్స్ తీసుకోవడంపై చాలా మంది నిర్లక్ష్యంగా వుంటారు.రోజువారీ భత్యాన్నిచ్చే యాడ్-ఆన్ గురించి విన్నారా? మీ కారు ఏదైనా రిపేర్ కి వెళ్లినపుడు కొన్ని రోజుల పాటు మీకు కారు అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.అలాంటప్పుడు మీకు అవసరమైన ఖర్చును భరించడానికి ‘రోజువారీ భత్యం’ యాడ్-ఆన్ కవర్ మీకు సహకరిస్తుంది.సాధారణంగా 14 రోజుల పాటు రోజుకు రూ.500 వరకు రవాణా భత్యాన్ని ఇది అందిస్తుంది.అలాగే దురదృష్టవశాత్తు మీ కారు చోరీకి గురయిందనుకోందాం.బీమా, ఇన్వాయిస్ కవర్ కారు విలువనే మీకు చెల్లిస్తుంది.కానీ, కారులో విలువైన వస్తువులు ఉన్నట్లయితే.వాటికి బీమా సంస్థ బాధ్యత వహించదు.
అలాంటప్పుడు మీకు ‘వ్యక్తిగత వస్తువుల’ కవర్ యాడ్-ఆన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అదేవిధంగా మీరు వాహనం ‘కీ’ పోగొట్టుకున్నపుడు మతి పోయినంత పని అయిపోతుంది.కొన్ని ఎన్క్రిప్టెడ్ కార్ ‘కీ’లతో నేడు చాలా కార్లు కంప్యూటర్-కోడెడ్ కారు ‘కీ’లను కలిగి ఉంటున్నాయి.వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది.
అలాంటపుడు మీరు కారు ‘కీ’ను పోగొట్టుకున్నయెడల మీకు ‘కీ’ రీప్లేస్మెంట్ యాడ్-ఆన్ సహకరిస్తుంది.బీమా కంపెనీ, కొత్తగా రీప్లేస్ చేసిన ‘కీ’ పరిహారం చెల్లిస్తాయి.
దీర్ఘకాలిక భద్రత కోసం ఈ యాడ్-ఆన్లను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచి ఆలోచన అని నిపుణులు చెబుతున్నారు.