ఫుట్‌బాల్ ప్రియులకు ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ చక్కటి వినోదాన్ని పంచుతుంది.ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్-2022 ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది.
ప్రస్తుతం సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో బ్రెజిల్, పోర్చుగల్ వంటి పటిష్ట జట్లు సెమీ ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
మొత్తం 32 జట్లు ఈ టోర్నీలో తలపడితే చివరికి ప్రస్తుతం సెమీఫైనల్‌కు నాలుగు జట్లు చేరుకున్నాయి.డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా, మొరాకో, అర్జెంటీనా జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.
మంగళవారం రాత్రి జరిగే సెమీఫైనల్లో లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనాతో క్రొయేషియా తలపడనుంది.బుధవారం రాత్రి జరిగే సెమీఫైనల్లో మొరాకో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో తలపడనుంది.
ఇక ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొన్న జట్లకు భారీగా ప్రైజ్ మనీ అందనుంది.విజేతగా నిలిచిన జట్టుకు 42 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 347 కోట్లు అందనున్నాయి.రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 30 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.248 కోట్లు బహుమతి అందనుంది.మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.223 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.206 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.5, 6, 7, 8 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.140 కోట్ల చొప్పున బహుమతి అందనుంది.
9 నుంచి 16వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.107 కోట్ల బహుమతి అందనుంది.17 నుంచి 32 వరకు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.74 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ అందిస్తారు.పైన పేర్కొన్న ప్రైజ్ మనీతో పాటు, టోర్నమెంట్‌కు ముందు ప్రారంభ ఖర్చులను కవర్ చేయడానికి FIFA ప్రతి జట్టుకు 1.5 మిలియన్ల యూఎస్ డాలర్లను అందించింది.