తిన్న, పడుకున్న, పండగ వచ్చిన, కడుపు వచ్చిన, కాకర కాయ వచ్చిన అన్ని వింతలే, సర్వం విశేషాలే అన్నట్టుగా ఉంది యూట్యూబ్ లో సెలబ్రిటీస్ హడావిడి.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టేయడం అందులో రోజు వారి పనులు పెట్టి ఎడా పెడా సంపాదించేయడం సర్వ సాధారణం అయిపోయాయి.
వీడియో మధ్యలో ఎదో ఒక బ్రాండ్ పట్టుకొని వచ్చి సదరు బ్రాండ్ కంపెనీ కి లక్షల్లో బిల్లు వేసి అది వారికీ సూట్ అయినా కాకపోయినా రోజు ఇదే వాడతాం అంటూ చెప్తూ జనాలను పిచ్చోళ్లను చేయడం.ఇంకా ఒక మెట్టు ఎక్కి ట్రేడింగ్ ఆప్స్, రమ్మీ లాంటి జూదపు యాపుల ప్రమోషన్ కూడా చేస్తూ కంపెనీల నుంచి లక్షల్లో సొమ్ము వసూల్ చేస్తున్నారు.
కానీ ఎటొచ్చి జనాలే ఇక్కడ పిచ్చోళ్ళు.
వాళ్ళు వాడని ఒక బ్రాండ్ ని జనాల మీదకి రుద్దుతున్నారు.అది నిజమే అని నమ్మి రోజు చూసే వారు వాడుతూ కొన్ని సార్లు పప్పులో కాలేస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే వాళ్ళ ఇళ్లలో ఏం జరిగిన వీడియోలు తీసి జనాలపై బలవంతం గా రుద్దడం అంటే మరి దారుణం.
ఈ మధ్య ట్రేండింగ్ లిస్ట్ చూస్తే ఈ వీడియోలో ఎక్కువగా కనిపించడం విశేషం.దీన్ని బట్టి జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి వీడియోలు చేస్తున్నాం అంటారేమో కానీ యూట్యూబ్ ఫీడ్ ఓపెన్ చేస్తే కుప్పలు కుప్పలుగా ఇలా బ్లాగ్స్ , వ్లాగ్స్, DIML వీడియోస్ కనిపిస్తుంటే చూడక చస్తామా అనేది సగటు ప్రేక్షకుడి ఫీలింగ్.
అయితే ఈ వీడియోస్ చేస్తున్నది ఎక్కువ గా బుల్లి తెర ఆర్టిస్టులు, కామెడీ స్టార్స్, రీల్స్ స్టార్స్ కావడం తో మధ్య తరగతి గృహిణి లు, యువత ఎక్కువగా అట్ట్రాక్ట్ అవుతన్నారు.చూస్తున్నారు కాబట్టి తీస్తున్నారు అంటారు స్టార్స్, తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అంటారు వ్యువర్స్.ఏది ఏమైనా జనాలపై వారి సొంత బ్రాండింగ్ ప్రమోషన్స్ కోసం, సొంత వ్యూస్ కోసం, యూట్యూబ్ ఆదాయం కోసం వీడియోలు చేసి డబ్బులు బాగానే కూడబెడుతున్నారు.మనకు మాత్రం ఇంటర్నెట్ వాడకం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు.