మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.కేసీఆర్ నియంత పాలనపై సమరశంఖం మోగించిన ఆయన వెంట మునుగోడు ప్రజలు ఉన్నారన్నారు.
హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించినట్లే భారీ మెజార్టీతో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ గద్దెపై కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.బీజేపీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.
అందుకే బీజేపీ కంటే ముందు హడావుడిగా సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
అనంతరం వామపక్ష నేతలు కేసీఆర్ కు మద్ధతు ఇవ్వడం కంటే హీనమైన చర్య మరొకటి లేదని ఈటల విమర్శించారు.
ట్రేడ్ యూనియన్లు సమ్మె చేస్తే కేసీఆర్ ఎప్పుడైనా పిలిచి సమస్యలను పరిష్కరించారా అని ప్రశ్నించారు.సీపీఐ, సీపీఎం పార్టీ నేతలు ఎనిమిదేళ్లలో ఏనాడైన ప్రగతిభవన్ లో అడుగు పెట్టారా అని నిలదీశారు.