ఈ అనంతమైన విశ్వంలో భూమితో పాటుగా మరో గ్రహంపై జీవమనుగడ సాధ్యమేనా అన్న దిశగా కొన్ని వందల ఏళ్ళనుండి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.అయితే విశ్వంలో భూమి లాంటి గ్రహాలు కొన్ని ఉన్నప్పటికీ వాటిపై జీవం ఆవిర్భవించే వాతావరణం మాత్రం కనబడుటలేదు.
కానీ భూమిపై ఉన్నట్లుగానే, ఇతర గ్రహాల్లో కూడా ఎక్కడోచోట కచ్చితంగా జీవం ఉండే ఉంటుందన్న బలమైన కారణంతోనే శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు చేస్తున్నారు.ఈక్రమంలో లక్షల ఏళ్ల నాటి పరిస్థితులను తెలుసుకుంటే, విశ్వంలో జీవం గుట్టు తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ క్రమంలో భూమిపై లభించిన కొన్ని పదార్ధాలపై వారు పరిశోధన జరుపుతున్నారు.అయితే ఇందులో భాగంగా క్రియాశీలకంగా ఉన్న లక్షల ఏళ్ల నాటి స్పటికం ఒకటి వారికి లభించింది.
జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికాకు చెందిన పరిశోధకులు ఇటీవల ఈ స్పటికన్ని కనుగొనడం జరిగింది.సుమారు 830 మిలియన్ ఏళ్ళు అనగా సుమారు 83 కోట్లు సంవత్సరాలు కిందటిదైన ఈ స్పటికంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న పురాతన సూక్ష్మజీవులు మరియు ప్రొకార్యోటిక్ మరియు ఆల్గల్ కారక జీవులు ఉన్నట్లు తేల్చారు.
స్పటికంలో ఉన్న సూక్ష్మ గదుల్లో ద్రవం చేరి, అది సూక్ష్మ జీవులకు నిలయంగా మారినట్టు పరిశోధకులు గుర్తించారు.
ఈ స్పటికంపై పరిశోధనలు జరుపుతున్న వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీకి చెందిన భూగర్భ శాస్త్రవేత్త కాథీ బెనిసన్, మాట్లాడుతూ “ఈ స్పటికంలో ఉన్న అసలు ద్రవం, ఘనీభవించి ఉప్పుగా మారిందని, ఇక్కడ ఆశ్చర్యం పరిచే ఏమిటంటే, సూక్ష్మజీవుల నుండి మనం ఆశించే వాటికి అనుగుణంగా ఉండే ఆకృతులను కూడా స్పటికంలో గుర్తించామని మరియు 830 మిలియన్ సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ స్పటిక ద్రావణంలో సూక్ష్మ జీవులు ఇప్పటికీ జీవించి ఉండవచ్చని” అన్నారు.
అందువలన స్పటికంను పగలగొట్టి, అందులోని ద్రవం, సూక్ష్మ జీవులపై పరిశోధనలు జరిపితే విశ్వంలో జీవం గుట్టు కనిపెట్టడం తేలిక అవుతుందని కాథీ వెల్లడించారు.కానీ అది అనుకున్నంత సులువు కాదని కూడా ఆమె పేర్కోవడం కొసమెరుపు.