బావర్చి బిర్యానీ… హైదరాబాద్‌లోనే కాదు.ఈ భాగ్య నగరంతో పరిచయం ఉన్న భోజన ప్రియులకు అందరికీ ఇష్టమైన ఫుడ్ స్పాట్.
ఇంకా చెప్పాలంటే నగరం సరిహద్దులు దాటి విదేశాలకు పాకిన ఘనత బావర్చి బిర్యానిది.అయితే, బావర్చి బిర్యానికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.
అప్పుడప్పుడు కొన్ని విమర్శలకు తావిచ్చే ఘటనలతోనూ ఈ రెస్టారెంట్ వార్తల్లోకెక్కుతోంది.తాజాగా, బావర్చి బిర్యానీలో బల్లి కనిపించడం షాక్ కి గురి చేసింది.
రాంనగర్ కార్పొరేటర్ కె.రవిచారి మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చీ హోటల్‌లో చికెన్ బిర్యానీ, తందూరీ రోటీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చారు.డెలివరీ వచ్చాక రవిచారి, అతడి మిత్రులు బాకారంలోని పార్టీ కార్యాలయంలో తినేందుకు సిద్ధమవుతుండగా, బిర్యానీ మధ్యలో బల్లి అవశేషాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.వాంతులు చేసుకుని, ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.
అనంతరం బావర్చి హోటల్ వద్దకు వచ్చి యజమానికి ఫిర్యాదు చేశారు.వారి నుంచి స్పందన రాకపోవడంతో వెంటనే ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో వీడియో తీయించి జీహెచ్‌ఎంసీ ఫుడ్ కంట్రోల్ అధికారులకు, ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయికి, చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు టెస్టింగ్ కోసం ఆ బిర్యానీని ఫుడ్ కంట్రోల్ ల్యాబ్ కి పంపించారు.సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు.హోటల్ లో తనిఖీలు చేశారు.ఫుడ్ శాంపిల్స్ ను కూడా సేకరించారు.ఫుడ్ ల్యాబోరేటరీ నుంచి వచ్చే నివేదిక ప్రకారం బావర్చి రెస్టారెంట్‌పై తదుపరి చర్యలు ఉంటాయని, ప్రస్తుతం షోకాజ్ నోటీసులు జారీచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న బావర్చీ హోటల్‌ను సీజ్ చేయాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ రవిచారి డిమాండ్ చేశారు.
కాగా, వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బావర్చీ హోటల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గడ్డం నవీన్ ఆధ్వర్యంలో హోటల్ వద్ద ధర్నా చేశారు.