ప్రస్తుతం ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందని.
అమెరికా సారథ్యంలోని నాటో దళాలు ప్రచారం చేస్తున్నాయి.అదే జరిగితే రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నాటో హెచ్చరిస్తోంది.
ఇప్పటికే ఉక్రెయిన్ బోర్డర్ వద్దకు నాటో భారీగా సైనికులను, అధునాతన యుద్ధ సామాగ్రిని మోహరించింది.దీంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
అటు వివిధ దేశ ప్రభుత్వాలు.ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ లిస్ట్‌లో ఇండియా కూడా వుంది.
భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున అక్కడి తన రాయబార కార్యాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది.
పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ఉక్రెయిన్‌లోని భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను తప్పనిసరిగా ఫాలో అవ్వాలని కోరింది.దానితో పాటు తమ క్షేమ సమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్‌డేట్ చేయాలంటూ భారత పౌరులకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.
ఏమైనా సాయం కావాలంటే సోషల్ మీడియాలోనూ సంప్రదించవచ్చని భారత ప్రభుత్వం సూచించింది.
ఇకపోతే.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు అక్కడ 200 మంది వరకు వున్నారు.వీరంతా ఉక్రెయిన్‌లో మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్నారు.
ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ ఉండలేక, చదువులను మధ్యలో వదిలేసి రాలేక ఆందోళనకు గురవుతున్నారు.మరికొద్ది రోజుల్లో కొత్త సెమిస్టర్ ప్రారంభమవుతుందని, ఇలాంటి పరిస్ధితుల్లో చదువులను మధ్యలో ఎలా వదిలేసి రాగలమని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కీయివ్‌లోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్ ప్రకారం ఉక్రెయిన్‌లో 18 వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడి వివిధ వర్సిటీల్లో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి కోర్సులు అభ్యసిస్తున్నారు.ప్రస్తుతానికి పరిస్థితులు సాధారణంగానే ఉన్నా వారిని దరఖాస్తులను నింపాల్సిందిగా ఎంబసీ అధికారులు కోరుతున్నారు.పరిస్థితులు తీవ్రతరమైతే తమను స్వదేశం తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.