దుబాయ్‌లోని మ్యూజియంలో భద్రపరిచిన ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా వాచ్ కొంతకాలం క్రితం అదృశ్యం అయింది.ఉన్నపళంగా రూ.20 లక్షల విలువైన చేతి గడియారం ఎలా మాయమైందో తెలియక మ్యూజియం సిబ్బంది షాక్ అయ్యారు.అయితే దుబాయ్‌లో చోరీకి గురైన ఈ లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ తాజాగా అస్సాం రాష్ట్రంలో ప్రత్యక్షమయింది.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసులు కొద్ది గంటల క్రితం వెల్లడించారు.
ఐతే ఎక్కడో దుబాయ్‌లో మాయమైన గడియారం అస్సాంలో ఎలా దొరికింది? అనే విషయం గురించి తెలుసుకుంటే.దుబాయ్‌లోని ఒక మ్యూజియంలో అస్సాం రాష్ట్రానికి చెందిన వాజిద్ హుస్సేన్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసేవాడు.ఒకరోజు అతడికి దొంగతనం చేయాలనే దుర్బుద్ధి పుట్టింది.
అప్పుడే దిగ్గజ క్రీడాకారుడు డీగో మారడోనా సంబంధించిన చేతి గడియారం దొంగలించాలని అనుకున్నాడు.మ్యూజియంలో పనిచేసే వ్యక్తే కాబట్టి ఎవరూ లేని సమయం చూసి చటుక్కున చేతి గడియారం దొంగిలించాడు.
విషయం తెలుసుకున్న మ్యూజియం యాజమాన్యం దుబాయ్ పోలీసులకు సమాచారం అందించింది.తక్షణమే దర్యాప్తు ప్రారంభించిన దుబాయ్ పోలీసులు సెక్యూరిటీ గార్డ్ వాజిద్ హుస్సేన్‌తో పాటు కొందరు అనుమానితులను విచారించి వదిలిపెట్టారు.
ఆ సమయంలో వాజిద్ హుస్సేన్ తెలివిగా సమాధానాలు చెప్పి పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు.అప్పటికప్పుడు అక్కడినుంచి తట్టాబుట్టా సర్దుకుని స్వదేశం వెళితే దొరికిపోతామని భావించాడు.
అందుకే హుస్సేన్ కొన్నాళ్లు అక్కడే సెక్యూరిటీ గార్డ్ గా కొనసాగాడు.
కొద్దిరోజుల తర్వాత చేతి గడియారం విషయం గురించి అందరూ మర్చిపోయి ఉంటారని హుస్సేన్ భావించాడు.ఏదో ఒక కారణం చెప్పి అక్కడి నుంచి బయట పడాలని అనుకున్నాడు.అప్పుడే తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు.
అయితే మొదటి నుంచి ఇతడిపై రహస్యంగా దుబాయ్ పోలీసులు ఒక కన్ను వేసి ఉంచారు.ఇలాంటి సమయంలో హుస్సేన్ స్వస్థలానికి వెళ్లిపోవడంతో పోలీసులకు అనుమానం మరింత పెరిగిపోయింది.
దాంతో దుబాయ్ పోలీసులు భారత పోలీసులకు ఈ విషయం గురించి తెలియజేశారు.
దీన్ని సీరియస్ గా పరిగణించిన డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత తన పోలీసు బృందంతో రంగంలోకి దిగారు.శనివారం ఉదయం సమయంలో అనుమానితుడి ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.ఆ సమయంలో హుస్సేన్ ఇంట్లో మారడోనా చేతి గడియారం చూసి ఆశ్చర్యపోయారు.
వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ దొంగతనం దుబాయ్, ఇండియాలో చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.దుబాయ్, ఇండియా పోలీసుల పరస్పర సహకారంతోనే దొంగ దొరికాడని ఆయన పేర్కొన్నారు.