ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.విదేశాలలో తెలుగు వారి కోసం ఏర్పాటు చేయబడి ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంస్థగా అవతరించిన తానా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా తెలుగు బాషాభివ్రుద్ది, సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రాముఖ్యతనిస్తూ తెలుగు వెలుగులు విదేశంలో సైతం ప్రసరింపజేయడంలో తనవంతు పాత్ర కీలకంగా పోషిస్తోంది.
ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ తెలుగు సాహిత్య, బాష, కళల అభివృద్దిలో తనవంతు సహకారం అందిస్తోంది.తాజాగా
తానా ఎంతో ప్రతిష్టాత్మకంగా పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించింది.
తెలుగు రచనలు, సాహిత్యం, లేదా ఇతరాత్రా అంశాలపై మంచిని ప్రోశ్చహించే ఎలాంటి రచనలు అయినా సరే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలంటూ ఓ ఉద్యమాన్ని మొదలు పెట్టింది.ఒక మంచి పుస్తకాన్ని కొని మీ భంధువులు, లేదా స్నేహితులు, చిన్న పిల్లలకు బహుమతులుగా ఇవ్వండి, వారు కూడా ఇతరులకు పుస్తకాలను ఇవ్వమని చెప్పండి, ఇలా చేయడం వలన పుస్తక పటనంపై ఆసక్తి పెరుగుతుందని సూచించింది.
దాంతో ఈ వేడుకలను తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి లాంచనంగా ప్రారంభించారు.
అంజయ్య చౌదరి తన స్నేహితులకు పుస్తకాలను కొని ఇచ్చారు. పుస్తకాలు కొని మీరు ఎవరికి ఇచ్చినా సరే ఒక ఫోటో, మీ వివరాలు, పుస్తకం పుచ్చుకున్న వారి వివరాలు, ఊరి పేరు ఇలా కొన్ని వివరాలు తానా వెబ్సైటు లో అప్లోడ్ చేయడం వలన ఈ ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలు అందరికి తెలుస్తాయని, తద్వారా ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని, మరింత మందికి ఈ ఉద్యమం చేరువ అవుతుందని, దాదాపు 25 వేల పుస్తకాలు ఇలా పాటకుల చేతికి అందేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తానా తెలిపింది.ఎన్నో విద్యా సంస్థలు,పలు స్వచ్చంద సంస్థల నుంచీ విశేష స్పందన లభిస్తోందని, సంక్రాంతి పండుగ వచ్చేంత వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందని తానా వెల్లడించింది.
బహుకరించిన విషయాలు వెబ్సైటు లో పొందుపరిస్తే పుస్తక నేస్తం అనే ప్రశంసా పత్రం అందిస్తామని ప్రకటించింది తానా.