వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లినప్పటికీ ప్రవాస భారతీయులకు మాతృదేశంపై అంతులేని ప్రేమ, గౌరవం వున్నాయి.తాము ఈ స్థాయికి రావడానికి కారణమైన జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వారు సదా సిద్దంగానే వుంటారు.
ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో వున్న ప్రవాసీ సంఘాలు భారత్‌లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి.దీంతో పాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, కంపెనీల ఏర్పాటు ద్వారా దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సైతం ఎన్ఆర్ఐలు పాటుపడుతున్నారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రవాస భారతీయులు చేసిన సేవలు ఎవరూ మరిచిపోలేరు.వివిధ దేశాల నుంచి పీపీఈ కిట్లు, మందులు, రక్షణ పరికరాలు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తదితర వస్తువులను భారతదేశానికి పంపారు.
తాజాగా గ్రామీణ భారతదేశంలో వైద్య సదుపాయాలను మెరుగు పరిచేందుకు గాను అమెరికాలో స్థిరపడిన భారత సంతతి వ్యక్తులు నడుం బిగించారు.గాంధీయన్ సొసైటీ, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (జీవోపీఐవో)లు సంయుక్తంగా భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కెనడాలో ఖాదీ ఫ్యాషన్ షో, మ్యూజిక్ కాంపిటీషన్ నిర్వహించాయి.
న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్‌లోని గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య రంగానికి చేయూతను అందించేందుకు గాను అంబులెన్స్‌ల సౌకర్యాన్ని మెరుగుపరచాలని నిర్వాహకులు నిర్ణయించారు.ఇందుకోసం ఆగస్టు 15న జరిగిన ఈవెంట్ ద్వారా 10 అంబులెన్స్‌ల కోసం నిధులను సేకరించారు.
ఫ్యాషన్ షోను ఖాదీ ఫ్యాబ్రిక్‌ను ప్రోత్సహించేందుకు నిర్వహించారు.ఖాదీని జాతిపిత మహాత్మాగాంధీ అమితంగా ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే.షో కోసం ఖాదీ ఫ్యాబ్రిక్‌ను ఆధునిక శైలిలో తయారు చేశారు.తద్వారా యువతరం ఖాదీవైపు మొగ్గు చూపుతారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో 10 మంది దాతలు ముందుకు వచ్చి.అంబులెన్స్‌లను విరాళంగా ఇస్తామని ప్రకటించారు.
అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన వారిలో భద్ర బూటాల, హస్ముఖ్ పటేల్, కృష్ణ పిర్లమర్ల, డాక్టర్ ప్రభు రాచకొండ, మాగన్ భాయ్ పటేల్, గీత బూటాల తదితరులు వున్నారు.
గాంధేయ సొసైటీ వ్యవస్దాపకుడు భద్ర బూటాల మాట్లాడుతూ.
ఈ ఏడాది 50 అంబులెన్స్‌లను గ్రామీణ భారతదేశానికి అందించడానికి తమ సొసైటీ కట్టుబడి వుందన్నారు.వీటిని భారత్‌లోని గాంధీ గ్రూపుల ద్వారా నిర్వహిస్తామని భద్ర చెప్పారు.