మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది.మన హిందువుల ఇళ్ళల్లో తులసి మొక్కలేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
తులసిని ఒక దైవ మొక్కగా భావిస్తారు.ఈ క్రమంలోనే తులసి మొక్కను గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు.
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి దోహదపడుతుంది.అదేవిధంగా తులసి మొక్కను పూజించడం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి కనుక తులసి మొక్కను దేవత మొక్కగా భావిస్తారు.
ఎంతో ప్రాధాన్యత ఉన్న తులసి మొక్కను ప్రతి ఇంట్లో తూర్పు వైపు ఉంచి ప్రత్యేక కోట నిర్మించి పూజిస్తారు.ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసికోటకు నీరు పోసి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
అయితే మన ఇంట్లో ఎల్లప్పుడు సుఖ సంతోషాలు, సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలగాలంటే తులసిమొక్క పూజ తప్పనిసరి.శనివారం తులసి మొక్కకు పూజ చేసే సమయంలో తులసి మొక్క కింద శాలిగ్రామ రాయి ఉంచి పూజ చేయటం వల్ల వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
గండక్ శిలలను శాలిగ్రామ రాళ్లుగా చెబుతారు.ఈ రాయిని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు కనుక సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని శనివారం తులసి కోట కింద ఉంచి దీపం వెలిగించి పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా పెళ్లయిన కొత్తజంట ఈ విధంగా పూజ చేయటం వల్ల వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో గడుస్తుంది.అదేవిధంగా సంతానం లేనివారు తులసికోటకు శనివారం ఈ విధంగా పూజ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.