మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచారాలను పాటిస్తూ పూజలు, వ్రతాలు ,నోములు చేస్తుంటారు.అయితే ఏ శుభకార్యం జరిగినా ఆ కార్యం ఏ ఆటంకం లేకుండా పూర్తి కావాలని ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తారు.విఘ్నేశ్వరుడికి ఎన్నో పేర్లు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే.వినాయకుడు, గణపతి, ఏకదంతుడు, లంబోదరుడు ఇలా పలురకాల పేర్లతో స్వామివారిని పిలుస్తుంటారు.అయితే వినాయకుడిని “ఏకదంతుడు” అని పిలవడం గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
శివుడు కైలాసంలో లేని సమయంలో పార్వతీదేవి వినాయకుడిని సృష్టించి, ప్రాణం పోసిన సంగతి మనకు తెలిసినదే. కైలాస ముఖద్వారం వద్ద కాపలా ఉన్న వినాయకుడిని శివుడు చంపటం, అందుకు మరలా ఏనుగు తలను తెచ్చి వినాయకుడికి పెట్టడం మనకు తెలిసిందే.
అయితే పరశురాముడు తన తండ్రిని చంపిన కార్తవీర్యుని చంపి తన గురువు అయిన ఆ పరమశివుని కలవడానికి కైలాసానికి వస్తాడు.ఆ సమయానికి కైలాసంలో ఏకాంత సమయంలో ఉన్న శివపార్వతులకు బయట కాపలా కాస్తున్న వినాయకుడు పరశురామున్ని లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వడు.

పరశురాముడు వినాయకుడు ఎంత చెప్పినా వినకుండా తనతో వాదించి లోపలికి వెళ్లాలని మొండి పట్టు పడతాడు.వారిద్దరి మధ్య మాట మాట పెరిగి ఆ “పరమశివుని దర్శించు కోకుండా అడ్డు పడటానికి నీవు ఎవ్వరు”అంటూ పరశురాముడు వినాయకుడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.అలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది.దీంతో వినాయకుడు తన తొండంతో పరశురాముడిని ఒక్కసారిగా పైనుంచి కిందికి వేస్తాడు.దీంతో ఎంతో ఆగ్రహానికి గురైన పరశురాముడు తన గండ్రగొడ్డలిని తీసుకొని గణపతి పై దాడి చేయడంతో ఒక దంతం విరిగిపోతుంది.