మన భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు చారిత్రాత్మక కథనాలు, వింతలు, రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి.సైన్స్ కి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఆలయాలలో ఉన్నాయి.
ఈ విధమైనటువంటి వింత కలిగిన ఆలయాలలో ఒకటిగా ఉత్తరాఖండ్ లోని అలకనంద నది ఒడ్డున ఉంది.శక్తి పీఠాలలో ఒకటిగా, చార్ ధామ్ రక్షకురాలుగా అక్కడ అమ్మవారు పూజలందుకుంటున్నారు.
నది ఒడ్డున కొలువైవున్న ఈ అమ్మవారి ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్ లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది.
ఈ ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం నుంచి ఉన్నట్లుగా చారిత్రాత్మక కథనం.అయితే అన్ని అమ్మవారి ఆలయాలలో మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ధారీదేవి ఆలయం పై కప్పు ఉండదు.
ఈ విధంగా ఆలయం పై కప్పు లేకుండా ఉండటం అమ్మవారికి ఎంతో ఇష్టం.అదే విధంగా ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారికి మరొక ప్రత్యేకత ఉంది.
ఇక్కడ వెలసిన అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, రాత్రికి వృద్ధ స్త్రీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.అదేవిధంగా గర్భగుడిలో కొలువై ఉన్న అమ్మవారు కేవలం సగభాగం వరకు మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
అలకనంద ఒడ్డున కొలువైవున్న అమ్మవారు అత్యంత శక్తివంతరాలని, అలకనంద నది ప్రవాహాన్ని ఈ అమ్మవారు నిర్ణయిస్తారని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ ప్రస్థానం మహాభారతంలో కూడా ఉంది.అదేవిధంగా సిద్ధ పీఠం పేరుతో భాగవతంలో కూడా ఈ ఆలయం గురించి పేర్కొన్నారు.108 శక్తిపీఠాలలో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు.ధారీదేవి విగ్రహం క్రింది భాగం కాళీమఠ్ లో వున్నది.అయితే నిజానికి కాళీమఠ్ లో అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు.ఆ భాగంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు .ఈ స్త్రీ యంత్రాన్ని ఆది శంకరాచార్యులవారు స్థాపించారు.ఈ విధంగా రోజులో మూడు రూపాలను మారుస్తూ ధారీ దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేర్చే తల్లిగా పూజలందుకుంటున్నారు.