వివాహంలో గరికె ముంత కు చాలా ప్రాధాన్యం ఉంటుంది.అయితే ప్రాంతాన్న బట్టి పిలిచే పేరులో మార్పు ఉంటుంది.
కానీ ప్రతి ప్రాంతంలోనూ వివాహ సమయంలో ఈ ఆచారం ఉంది.ఆంధ్ర దేశంలోనూ, రాయలసీమ లోనూ, తెలంగాణాలోనూ, కర్నాటక లోనూ కరగ అనే పేరుతోనూ… తమిళంలో కరగం అనే పేరు తోనూ… ఇతర ఆంధ్ర ప్రాంతాలలో గరికె, గరిక, గరిగ, గరిగె అనే పేర్లతోనూ పిలుస్తారు.
ఏ పేరుతొ పిలిచినా ఆచారం మాత్రం ఒకటే.
గరికెలను పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే అని భావిస్తారు.గరికె అంటే కుండ అని అర్ధం.అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందంటే ….
ద్రౌపది తన వివాహ సమయంలో ఆనందంతో ప్రక్క నున్న కలశాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసిందనీ, ఆ విధంగా అది పవిత్రం పొందిందనీ అంటారు.అప్పటి నుంచి వివాహం సమయంలో అన్ని ప్రాంతాలలోను ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
ఈ గరికె ముంతను పెళ్ళికి ముందు రోజు కుమ్మరి ఇంటికి వెళ్లి కానుకలు చెల్లించి ఇంటికి తీసుకువచ్చి ఒక గదిలో ఉంచి దీపారాధన చేసి పూజలు చేస్తారు.ముందుగా ఈ గరిగెను పూజించటాన్ని గౌరి పూజగా భావిస్తారు.
వివాహ సమయంలో గరిగెను దంపతుల ముందుంచి మరల పూజ చేసి, వివాహాన్ని పూర్తి చేస్తారు.వివాహం జరిగినంత సేపూ గరిగె ముంత ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది.
వధువు అత్తగారింటికి వెళ్ళే ముందు ఈ గరిగను వధువుతో పంపించి పెండ్లి తరువాత కూడ దానిని పవిత్రంగా చూస్తారు.