తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల గాలి కూడా చాలా వేడిగా వీస్తున్నట్లుంది.రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న సందర్భంగా ఇప్పటి వరకు ప్రచారం చేసుకున్న అభ్యర్ధులు తమదే గెలుపు అంటే తామే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు.
ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుని ఓటర్లను ఆకట్టుకుందామని ప్రయత్నించారు.కానీ వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో రిజల్ట్ వస్తే గానీ తెలియదు.
ఇకపోతే గద్వాలలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ టీఆర్ఎస్ సర్కారు పై ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులిచ్చి ఓట్లు కొనడం ద్వారా నీచ సాంప్రదాయానికి తెర లేపిందని, ఉద్యోగస్తులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్న విషయం తెలిసి ఎన్నికల లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారని ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీలుంటే కేవలం యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడమే అని అన్నారు.ఇక ఈ ఎన్నికల తర్వాత 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనడం పచ్చి అబద్ధమని, ఇదంతా పదవుల కోసం చేస్తున్న జిమ్మిక్కులని విమర్శించారు.