గడిచిన నాలుగేళ్ల కాలంలో 6,76,074 మంది భారతీయులు తమ ఇండియన్ సిటిజన్ షిప్‌ను వదులుకున్నారట.ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు వివరించింది.2015-2019 మధ్య కాలం నాటి గణాంకాలను సభ ముందుకు తీసుకొచ్చింది.వీరంతా భారత పౌరసత్వాన్ని వీడి తాము ఎక్కడైతే ఉంటున్నామో ఆ దేశ పౌరసత్వం తీసుకున్నట్టు హోంశాఖ తెలిపింది.కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.2015లో 1,41,656 మంది.2016లో 1,44,942.2017లో 1,27,905 మంది.2018లో 1,25,130.2019లో 1,36,441 మంది భారతీయులు మాతృదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మొత్తం 1,24,99,395 మంది భారతీయులు వున్నట్లు కేంద్రం వెల్లడించింది.అలాగే ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏ ప్రతిపాదనను పరిగణించడం లేదని లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చింది.
మరోపక్క ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కోసం 2020లో 1,91,609 మంది విదేశీయులు దరఖాస్తు చేసుకున్నట్టు కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది.
చదువులు, ఉద్యోగం, వ్యాపారం ఇలా కారణం ఏదైనా ప్రపంచ వ్యాప్తంగా వలసల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డివిజన్, తాజాగా విడుదల చేసిన ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్ 2020 హైలైట్స్’ నివేదిక, 2020లో 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్ళినట్లు వెల్లడించింది.భారత్ నుంచి వలస వెళ్ళిన అత్యధిక మందికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియాలు ఆశ్రయం కల్పిస్తోన్నాయి.ఇక ఎన్ఆర్ఐలకు భారత దేశం తర్వాత మరో ఇల్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మారింది.
ప్రపంచంలోనే అత్యధికంగా 35 లక్షల మంది ప్రవాస భారతీయులు యూఏఈలో నివాసముంటుండగా, అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఉంటున్నారు.ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్‌లో కూడా భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారు.అంతర్జాతీయంగా అత్యధిక మంది వలసలకు ఆశ్రయం ఇస్తోన్న దేశం అమెరికా.2020లో 5.1 కోట్ల మంది వివిధ దేశాలకు చెందిన ప్రజలు అమెరికాకి వలస వెళ్ళారు.ఇది ప్రపంచంలోని మొత్తం జనాభాలో 18 శాతానికి సమానం.