క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.అధ్యక్షుడిగా ఆయన దిగిపోయిన తర్వాత కూడా దీనిపై విచారణ జరగనుంది.
ఇప్పటికే ప్రతినిధుల సభ అభిశంసనకు ఆమోదం తెలిపి తీర్మానాన్ని సెనేట్‌కు పంపింది.ఈ క్రమంలో ఈరోజు నుంచి ట్రంప్ అభిశంసనపై విచారణ జరగనుంది.
అయితే ఈ విషయంలో ట్రంప్‌కు సొంత పార్టీ నుంచి మద్దతు లభిస్తోంది.క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి ఆయనను బాధ్యుడిగా చేయడం సమంజసం కాదంటూ పలువురు రిపబ్లికన్ సెనేటర్లు అభిప్రాయపడ్డారు.
అభిశంసన తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.ట్రంప్ దోషిగా తేలేందుకు అవకాశమే లేదని ఆ పార్టీ సెనేటర్ ర్యాండ్ పాల్ అన్నారు.
అభిశంసన రాజ్యాంగ విరుద్ధమని, అది అమెరికాను విభజిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ట్రంప్ తప్పకుండా నిర్దోషిగా బయటపడతారని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ రోజర్ వికర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రసంగాలపై నేర ముద్ర వేయాలనుకుంటే చాలామందిని అభిశంసించాల్సి వస్తుందని పలువురు వ్యాఖ్యానించారు.కాగా, రెచ్చగొట్టే విధంగా ట్రంప్ చేసిన ప్రసంగమే క్యాపిటల్ హిల్‌పై దాడికి కారణమని డెమొక్రాట్ల చేస్తున్న ఆరోపణ.
మరోవైపు ఒక మాజీ అధ్యక్షుడిని అభిశంసించడం రాజ్యాంగబద్ధమేనా అనే విషయంపై సెనేట్ చర్చించనుంది.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.
క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.
భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.
వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో ట్రంప్ వ్యవహారశైలిపై అమెరికన్లు భగ్గుమన్నారు.చట్టసభ సభ్యులైతే జనవరి 20కి ముందే పదవిలోంచి దించాలని పావులు కదిపారు.
ఇదే సమయంలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాను బ్లాక్ చేశాయి.అయితే ఒక అడుగు ముందుకేసిన ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడికే ట్విట్టర్ షాకివ్వడం చర్చనీయాంశమైంది.తన ట్వీట్ల ద్వారా హింసను ప్రోత్సహించే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ ఆయన ఖాతాను శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
మరోవైపు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది.
చర్చ అనంతరం 232-197 ఓట్లతో అభిశంసన తీర్మానం నెగ్గింది.అనంతరం దీనిని హౌస్ స్పీకర్ సెనేట్‌కు పంపారు.