నేటి ప్రపంచంలో సొంత వాహనాల వాడకం కంటే కూడా అద్దె వాహనాల వాడకం ఎక్కువయ్యింది.ఊబర్, ఓలా లాంటి సర్వీసులు వచ్చాక వాటి వాడకం ఎక్కువయ్యింది.
ఇక ఇప్పుడు బైక్ రైడ్‌లు అందుబాటులో ఉండటంతో అందరూ వాటిని వినియోగించుకునేందుకు మక్కువ చూపుతున్నారు.ఈ క్రమంలో ఓలా బైక్ రైడర్‌లు తమకు తోచిన విధంగా వినియోగదారులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
కొన్నిసార్లు రైడ్ బుక్ చేసుకున్నాక వారు ఆలస్యంగా రావడం, లేదా క్యాన్సిల్ చేసుకోమనడం లాంటివి చేస్తున్నారు.
ఇలాంటి ఘటనను ఎదుర్కొన్న ఓ హైదరాబాదీ ఆగ్రహానికి గురయ్యాడు.
అంతటితో ఆగకుండా సదరు బైక్ రైడర్‌కు బుద్ధి చెప్పాడు.సాయితేజ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఈ నెల 18న రాత్రి 10.30 గంటలకు మైండ్‌స్పేస్ నుండి బంజారాహిల్స్ వెళ్లేందుకు ఓలా బైక్‌ను బుక్ చేసుకున్నాడు.అయితే ఎంతకీ ఆ బైక్ రైడర్ రాకపోవడంతో అరగంట తరువాత సాయితేజ అతడికి ఫోన్ చేశాడు.
‘సారీ సర్.నేను రాలేను అంటూ బదులిచ్చాడు సదరు బైక్ రైడర్.మరి ఇంతసేపు ఎందుకు వెయిట్ చేయించావని సాయితేజ అడిగితే ఆ రైడర్ బదులివ్వలేదు.
దీంతో సాయితేజ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.మోటార్ వెహికల్ సెక్షన్ 178 ప్రకారం ఎవరైనా టాక్సీని బుక్ చేసుకుంటే, ఆ రైడ్‌ను డ్రైవర్ రద్దు చేస్తే రూ.500 జరిమానా పడుతుందని చెప్పారు.అంతేగాక సాయితేజ రైడ్‌ను బుక్ చేసిన సదరు రైడర్‌ను పట్టుకుని అతడికి రూ.500 జరిమానా విధించారు పోలీసులు.క్యాబ్ బుక్ చేసుకున్నాక డ్రైవర్ రద్దు చేసినట్లయితే 9490617346 అనే నెంబరుకు వాట్సాప్ చేయాలని పోలీసులు సూచించారు.