వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పార్టీలోకి నాయకుల వలసలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి.అప్పటివరకు ఒకే నియోజకవర్గంలో కత్తులు నూరుకుని ఒకరి మీద ఒకరు రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయిలో చేసుకున్న నాయకులంతా ఇప్పుడు ఒకే పార్టీలోకి వచ్చి చేరారు.
దీంతో పార్టీ బలం మరింత పెరిగింది అని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి.
తాము మొదటి నుంచి ఎవరి మీద అయితే పోరాటం చేసామో అదే నాయకులు తమ పార్టీలో తమ పక్కన కూర్చోవడం నియోజకవర్గ స్థాయి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.కానీ అధిష్టానం వారిని చేర్చుకోవడంతో కాదు అనలేక, అవును అనలేక సతమతం అయిపోతున్నారు.
ఈ నేపథ్యంలో వారు మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేస్తారా? లేక జగన్ ఆదేశాలను కాదు అనలేక మౌనంగానే ప్రత్యర్థులతో కలిసి పనిచేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతానికి జగన్ ఆదేశాలను పాటించాల్సి రావడంతో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నాయకులను వీరు అంగీకరిస్తున్నారు.కానీ భవిష్యత్తులో వీరంతా కలసి పనిచేసే పరిస్థితి లేదన్నది జగమెరిగిన సత్యం.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.
ఇతర పార్టీల నుంచి ఎమ్యెల్యేలను, కీలక నాయకులను పార్టీలో చేర్చుకుంది టీడీపీ.అయితే వారంతా పైకి కలిసికట్టుగానే ఉన్నట్టుగా కనిపించినా ఆ తరువాత వారి మధ్య ఆధిపత్య పోరు తలెత్తి చాలానే పార్టీకి డ్యామేజ్ జరిగింది.
ప్రస్తుతం ప్రతిపక్ష టీడీపీ నుంచి చేరికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.దీంతో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోతున్నారు.
జగన్ కూడా వారికి కండువా కప్పేస్తున్నారు.చేరికల సమయంలో అప్పటికే ఆ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను తీసుకుంటున్నప్పటికీ వారికి భవిష్యత్తుపై ఎలాంటీ హామీలు జగన్ ఇవ్వకపోవడంతో వారిలో ఆందోళన రేకెత్తుతోంది.
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరకుండానే ఆ పార్టీ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న వల్లభనేని వంశీ వ్యవహారాన్నే చూసుకుంటే గన్నవరం పార్టీ ఇంఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వంశీ రాకను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు.అయినా జగన్ నచ్చ చెప్పి ఆ గొడవను సర్దుబాటు చేశారు.అయితే ఇటీవల వంశీ జగన్ ను కలిసి విషయం మీడియాలో చూసే వరకు యార్లగడ్డకు తెలియకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారట.అలాగే గత ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన కొడాలి నానికి తెలియకుండానే ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ ను వైసీపీలో చేర్చుకున్నారు.
అవినాష్ కు విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగించడంతో ఏ వివాదమూ తలెత్తలేదు.
అలాగే రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు తోట త్రిమూర్తులను పార్టీలోకి తీసుకున్నారు.ఆయనను పార్టీలోకి తీసుకుని మూడు నెలలు కావస్తున్నా అక్కడి ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, తోట త్రిమూర్తుల మధ్య ఇప్పటికీ సరైన సన్నిహిత సంబంధాలు ఏర్పడలేదు.ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.