సాధారణంగా చాలా మందికి బొద్దింకలు, సాలె పురుగులు బల్లులు, ఇంకా ఇతర వికృతమైనవి, భయంకరమైనవి చూస్తే బాగా భయం కలుగుతుంది.కానీ ఎవరికి కూడా పండ్లు చూస్తే భయం వేయదు.
అయితే స్వీడన్(Sweden) దేశపు లింగ సమానత్వ మంత్రి పౌలినా బ్రాండ్‌బర్గ్‌కు(Paulina Brandberg) అరటిపండ్లు అంటే చచ్చేంత భయమట! అవును, అరటిపండ్లను(Bananas) చూస్తేనే ఆమె గుండెల్లో వణుకు పుడుతుందట.దీన్నే ‘బననాఫోబియా’ అని అంటారు.
స్వీడన్‌లోని ప్రముఖ పత్రిక ఎక్స్‌ప్రెస్‌న్ ప్రకారం, మంత్రి కార్యాలయం నుంచి లీక్ అయిన ఇమెయిల్‌ల ద్వారా ఈ విషయం బయటపడింది.ఈ ఇమెయిల్‌లలో మంత్రి ఎక్కడికి వెళ్ళినా అక్కడ అరటిపండ్లు ఉండకుండా చూడాలని, ఆమెకు అరటిపండ్లకు అలర్జీ ఉందని రాసింది.
కానీ, ఆ తర్వాత మంత్రి తాను అలర్జీతో బాధపడటం లేదని, కేవలం భయపడతానని చెప్పారు.
ఎక్స్‌ప్రెస్‌న్ పత్రికతో మాట్లాడుతూ, తనకు అరటిపండ్లు చూస్తే వాంతులు, ఆందోళన కలుగుతుందని, ఇది అలర్జీ లాగానే ఉంటుందని మంత్రి చెప్పారు.
ఈ భయం తన ఆరోగ్యాన్ని చాలా బాగా దెబ్బతీసిందని, ప్రస్తుతం దీనికి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.ఆమె ఈ విషయాన్ని 2020లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆమె X (ముందుగా ట్విట్టర్ అని పిలువబడేది) లో “ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన భయం – అరటిపండ్లు” అని రాసింది.ఆ పోస్ట్ ఇప్పుడు తొలగించబడింది కానీ, మనీ కంట్రోల్ అనే వెబ్‌సైట్ ఆ విషయాన్ని ప్రచురించింది.
అరటిపండ్ల భయం అనేది చాలా అరుదుగా ఉన్నప్పటికీ, చాలా తీవ్రమైన సమస్య.ఈ భయం ఉన్న వారికి అరటిపండ్లు కనిపించినా లేదా వాటి వాసన వచ్చినా చాలా భయంగా అనిపిస్తుంది, కొంతమందికి అస్వస్థత కూడా కలుగుతుంది.ఈ భయం ఎందుకు వస్తుందో ఖచ్చితంగా తెలియదు కానీ, చిన్నప్పుడు జరిగిన ఏదో ఒక సంఘటన లేదా మరో కారణం వల్ల ఇలాంటి భయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఈ భయంతో బాధపడే వారికి కొన్ని రకాల మానసిక చికిత్సలు చేస్తే ఈ భయం నుండి బయటపడవచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పౌలినా బ్రాండ్‌బర్గ్(Paulina Brandberg) ఒక్కరే అరటిపండ్ల భయంతో బాధపడుతున్నది కాదు.స్వీడన్‌లోని మరో రాజకీయ నాయకురాలు టెరేసా కార్వాల్యో కూడా ఇదే భయంతో బాధపడుతున్నారు.కార్వాల్యో X లో ఒక పోస్ట్ చేస్తూ బ్రాండ్‌బర్గ్‌కు(Brandenburg) తనకు అర్థమవుతుందని, వాళ్ళిద్దరికీ రాజకీయ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ భయం వల్ల వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటామని వ్యాఖ్యానించింది.