ఉక్రెయిన్-రష్యా(Ukraine-Russia) మధ్య యుద్ధం ఇప్పటిలో ఆగేలా లేదు.ఈ యుద్ధంలో ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు.
తాజాగా ఉక్రెయిన్‌లో రష్యా తరపున పోరాడుతూ 12 మంది భారతీయులు (Indians)దుర్మరణం చెందారు.వీరు రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో మోసపోయి చేరిన 126 మంది భారతీయుల్లో ఉన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ విషయాన్ని ధృవీకరించింది.అంతేకాదు, ప్రస్తుతం 16 మంది భారతీయులు కనిపించకుండా పోయారని, మరో 18 మంది యుద్ధంలో ఉన్నారని తెలిపింది.
వివరాల్లోకి వెళితే, ఈ 126 మంది భారతీయుల్లో 96 మందిని రష్యా సైన్యం(Russian army) నుంచి విడుదల చేయించి తిరిగి ఇండియాకు తీసుకొచ్చామని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) వెల్లడించారు.కానీ, ఇంకా కొంతమంది పోరాడుతుండగా, కొంతమంది ఆచూకీ తెలియడం లేదు.
వారిని ‘మిస్సింగ్ పర్సన్స్’గా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఉద్యోగాలు లేదా యూనివర్సిటీ అడ్మిషన్ల పేరుతో ఈ భారతీయులను రష్యాకు పంపించి మోసం చేశారు.
అక్కడికి వెళ్లిన తర్వాత వారి పాస్‌పోర్టులు లాక్కొని, బలవంతంగా ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి యుద్ధంలోకి పంపించారని సమాచారం.ఢిల్లీ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఈ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో సోషల్ మీడియా, స్థానిక ఏజెంట్లు బాధితులను రిక్రూట్ చేశారు.ఈ ఉద్యోగాల మోసంతో సంబంధం ఉన్న నలుగురిని భారత పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయంపై భారత ప్రభుత్వం రష్యా అధికారులతో మాట్లాడింది.
ఈ ఏడాది జనవరి 14న కేరళకు చెందిన వ్యక్తి ఉక్రెయిన్‌లో పోరాడుతూ మరణించినట్లు వార్తలు వచ్చాయి.గతంలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) 2024 జులై, అక్టోబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు.
రష్యా సైన్యంలోకి మోసపూరితంగా చేర్చుకున్న భారతీయులందరినీ విడుదల చేసి స్వదేశానికి పంపిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు.
ఇంతకుముందు, పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు ఆర్మీ యూనిఫాంలో ఉన్న వీడియో వైరల్ అయింది.తాము మోసపోయామని, సహాయం చేయాలంటూ వారు ఆ వీడియోలో వేడుకున్నారు.విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఈ పరిస్థితిని ఖండించారు.“ఏ భారతీయుడినీ యుద్ధంలోకి బలవంతంగా పంపడం ఆమోదయోగ్యం కాదు” అని అన్నారు.ఈ మోసంలో పాల్గొన్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.