చినబాబుకు పెద్ద జాబు కావాలంట..లోకేష్ దూకుడు వెనుక కారణం అదే..   The Fact Is Behind The Lokesh Over Speed     2018-07-11   01:00:47  IST  Bhanu C

ఈ మధ్యకాలంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ దూకుడు పెంచినట్టుగా కనిపిస్తున్నాడు. గతంకంటే కొంచెం మెరుగయినట్టు కనిపిస్తూ సీఎం స్థాయి తరువాత పెత్తనం అంత తనదే అన్నట్టు పరిపాలన వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటూ తన బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు కూడా లోకేష్ ని రాజకీయం గా మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చూస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే ఆయనకు మంచి సపోర్ట్ ఇస్తూ రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. లోకేష్ ఏపీలో తనకంటూ ప్రత్యేకంగా ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకుని సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.

దీనిలో భాగంగానే … త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం కాబోతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను చంద్రబాబు చూసుకుంటే.. క్షేత్రస్థాయిలో తాను పర్యటనలు చేసి శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతను లోకేష్ తీసుకుంటున్నారు. వారంలో మూడు రోజుల పాటు అధికారిక కార్యక్రమాలు.. మరో మూడు రోజుల పాటు జిల్లాల పర్యటనలు ఉండేలా లోకేష్ రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. రానున్న రెండు మూడు నెలల్లో తొలి విడత పర్యటన పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు.

లోకేష్ దూకుడుగా వెళ్లడం ఒక ఎత్తు అయితే ఆయన పార్టీని ముందుకు తీసుకువెళ్లే అంత శక్తి ఉందా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. దీనికి కారణం లోకేష్ నోరే కారణం. ఎక్కడ మాట్లాడినా నోరు జారీ పార్టీ పరువు తీస్తున్న లోకేష్‌ ప్రత్యర్థి పార్టీలకు పావుగా మారిపోతున్నాడు. అలాంటిది ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందోనన్న చర్చ కూడా పార్టీలో మొదలయ్యింది. అసలే లోకేష్ కి ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలియదు. ఉన్నది ఉన్నట్టు తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడేసి పార్టీని ఇరుకున పెట్టేస్తుంటాడు

నారా లోకేష్‌ను ముందుకు పెడితే.. ఇతర పార్టీల నేతలతో లోకేష్‌ను జనం పోల్చుకుంటే టీడీపీకి ఎన్నికల్లో తీరని నష్టం కూడా జరిగే అవకాశం ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా లోకేష్ కాబోయే సీఎం అని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో వెనక్కి తగ్గేందుకు లోకేష్ ఒప్పుకోడు. ఇక బాబు కూడా ఏది జరిగితే అది జరిగింది రాష్ట్రమంతా తిరిగి పార్టీలో పట్టు పెంచుకుంటేనే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకి ఏమాత్రం డోకా ఉండదు అనే కోణంలో ఆలోచిస్తున్నట్టుగా టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. లోకేష్ పట్టు పెంచుకుంటాడో లేక తన తడబాటుతో తప్పటడుగులు వేసి పార్టీ పరువు తీస్తాడో చూడాలి.