సామాజిక మాధ్యమాలకి బానిసలుగా బ్రతుకుతూ తమ జీవితాలని వెళ్ళదీస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.ముఖ్యంగా దేశం కాని దేశంలో ఒంటరిగా ఉంటూ కుటుంభానికి దూరంగా ఉండే ఎన్నారైలు ఈ సోషల్ మాధ్యమాలకి కట్టుబానిసలుగా మారిపోతున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నో అనర్ధాలు జరిగిపోతున్నాయి.కొందరు ఈ మాధ్యమాల వలన ప్రాణాలని సైతం పోగొట్టుకుంటున్నారు.
ఇలాంటి ఘటనే తాజాగా గల్ఫ్ లో జరిగింది.టిక్‌టాక్ వీడియోల కారణంగా కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రవాసీయుడు గల్ఫ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.సౌదీలోని రియాద్ లో ఐదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న సాయిలు, టిక్‌టాక్ లో విపరీతంగా వీడియోలు చేసేవాడు గల్ఫ్‌లో కష్టాలు ఎదుర్కొనే వారు ఎవరైనా ఉంటే ఎంబసీ తరుపున ఆడుకునే ప్రయత్నాలు చేసేవాడు సాయిలు.

ఇదిలాఉంటే టిక్‌టాక్ వీడియోల ద్వారా ఎక్కువ లైక్ లు వస్తే నెలకి 10 వేలు సంపాదించుకోవచ్చునని నమ్మిన సాయిలు అందుకోసం తీవ్రంగా వీడియోలు చేసేవాడు.ఆ క్రమంలోనే టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలను సాయిలు చేసేవాడు అయితే పెళ్లీడు వచ్చిన కూతురు ఉండగా ఇలాంటి వీడియోలు చేయడం ఏమిటి అంటూ అందరూ తిట్టడం మొదలు పెట్టారు.దాంతో అప్లోడ్ చేసిన వీడియోలు టిక్‌టాక్ నుంచీ తీసేశాడు.
కానీ ఆ వీడియోలు తన మిత్రులు తొలగించకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని సాయిలు వారిని బెదిరించినట్టుగా తెలుస్తోంది.కానీ స్వదేశానికి ప్రయాణమైన సాయిలు అక్కడ ఈ వీడియోలు ఎవరైనా చూస్తె పరువు పోతుందని భావించి,తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది.
ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.విచారణ పూర్తవ్వగానే సాయిలు మృతదేహం స్వదేశానికి పంపుతామని తెలిపారు.