దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో చాలా మంది పెళ్లి వేడుకలను కూడా నిలిపివేసుకొని ఎప్పుడు ఈ లాక్ డౌన్ పూర్తి అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సెలబ్రిటీ మాత్రం ఏమాత్రం ఆగకుండా తన పెళ్లి తంతును చాలా సింఫుల్ గా కానిచ్చేశాడు.
ఇంతకీ ఎవరా సెలబ్రిటీ అని అనుకుంటున్నారా.అతడే యంగ్ హీరో మరియు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ్.
తాజాగా ఈ యంగ్ హీరో పెళ్లి రేవతి అనే యువతి తో చాలా నిరాడంబరంగా జరిగింది.కేవలం వందమంది అతిధుల సమక్షంలో ఒక ఫామ్ హౌస్ లో ఈ పెళ్లి వేడుక జరపాల్సి వచ్చింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అనుకున్న సమయానికి పెళ్లి ఆగకూడదు అన్న ఉద్దేశ్యం తో మాజీ సీఎం కుమార స్వామి ఈ మేరకు నిర్ణయం తీసుకొని నిరాడంబరంగా వారి పెళ్లి వేడుకను నిర్వహించారు.బెంగళూరు రామ్‌నగర్ కేతగానహళ్లిలోని ఫాం హౌస్‌లో జరిగిన ఈ వివాహానికి దేవెగౌడ కుటుంబసభ్యులు, పెళ్లి కుమార్తె రేవతి తల్లిదండ్రులు సహా కొద్దిమంది అతిథులు హాజరయ్యారు.
అయితే ఈ వివాహ వేడుకపై కర్ణాటక ప్రభుత్వం నివేదిక కోరినట్లు తెలుస్తుంది.ఈ పెళ్లి వేడుకలో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపించడం తో పాటు సోషల్ మీడియాలోనూ ఈ పెళ్లి వేడుక పై విమర్శలు వచ్చాయి.
దీంతో యడియూరప్ప ప్రభుత్వం రామ్‌నగర్ అధికారుల నుంచి ఈ వివాహ వేడుకపై నివేదిక కోరినట్లు సమాచారం.కరోనా తీవ్రంగా ప్రబలుతున్న వేళ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ఈ విధంగా వివాహం జరపడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే వ్యవస్థను అవమానించినట్టు అవుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.దీనిపై రామ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ నుంచి నివేదిక కోరామని చెప్పారు.జిల్లా ఎస్పీతో కూడా ఈ అంశంపై మాట్లాడామని, ఒకవేళ ఈ పెళ్లి వేడుకలో లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేదన్న విషయం తేలితే మాత్రం చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు.