తెలుగు నెలల్లో పదకొండవ నెల అయిన మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు.ఈ మాఘ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ పంచమిని వసంత పంచమి అని పిలుస్తారు.
ఈ రోజున దేశం మొత్తం వసంతకాలం ప్రారంభమవుతుంది.ఈ వసంత పంచమి రోజు సరస్వతి దేవి పుట్టిన రోజుగా భావించి, ఆ చదువుల తల్లి సరస్వతీ దేవికి పెద్దఎత్తున పూజలను నిర్వహిస్తారు.
అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 16న వసంత పంచమి వస్తుంది.ఈ వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజించడం వల్ల సకల బుద్ధి ,జ్ఞానం కలుగుతాయని భావిస్తారు.
ఎంతో పవిత్రమైన ఈ వసంత పంచమి రోజు ఎన్నో శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు.ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు ఆ సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేసి ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు విద్యాభ్యాసం చేస్తారు.
ఈ విధంగా వసంత పంచమి రోజు విద్యాభ్యాసం చేయడం ద్వారా వారు చదువులో విద్యాబుద్ధులను నేర్చుకుంటారని భావిస్తారు.అందుకోసమే ఈ వసంత పంచమి రోజు వాగ్దేవిని ప్రార్ధించి విద్యాభ్యాసం చేయించాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది.
అన్నదానం తర్వాత జ్ఞాన దానమే గొప్పదని పండితులు తెలియజేస్తుంటారు.ఇలాంటి జ్ఞానం కలగాలంటే తప్పనిసరిగా ఆ చదువుల తల్లిని పూజించాలి.

వసంత పంచమి రోజున సరస్వతీ దేవికి తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించి, తెల్లని పుష్పాలతో పూజించాలి.అదేవిధంగా పెరుగన్నం, నెయ్యితో చేసిన పిండి వంటలు, చెరుకు రసం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.ఈ విధంగా సరస్వతి దేవిని పూజించడం ద్వారా ఆమె అనుగ్రహం కలిగి జ్ఞాన బుద్ధిని ప్రసాదిస్తుంది.చదువుల తల్లి కావడంతో విజయదశమి రోజున లేదా వసంత పంచమి రోజున చిన్నపిల్లలకు విద్యాభ్యాసం చేస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు బాసరలోని సరస్వతీ మందిరానికి చేరుకుని పెద్ద ఎత్తున విద్యాభ్యాస కార్య క్రమాలను వసంత పంచమి రోజున నిర్వహిస్తారు.