పరమ శివుడు మెడలో పామును ధరించి తిరుగుతారు.శ్రీ మహా విష్ణువు శేష తల్పంపై పవళిస్తారు.
ఇక సుభ్రమణ్య స్వామి సాక్షాత్ పాము రూపంలో భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటారు.ఈ కారణాలతో పాము దైవంగా నాగ దేవతగా ఆరాధిస్తున్నారు.నాగపంచమి,నాగులచవితి‘ని పర్వ దినాలుగా భావించి ఆ రోజుల్లో విశేషమైన పూజలు చేస్తున్నారు.ఈ పర్వ దినాలలో పుట్ట దగ్గరకు వెళ్లి పుట్టలో పాలు పోసి వడపప్పు, బెల్లం నైవేద్యంగా పెట్టటం అనాదిగా ఆచారంగా వస్తుంది.
ఈ ఆచారం వెనక పురాణ కథ కాకుండా మరొక పరమార్ధం కూడా ఉంది.సాధారణంగా పాములు పొలాల్లో ఉండి పంటకు హాని కలిగించే పురుగులను,ఎలుకలను తిని రైతులకు మేలు చేస్తాయి.
అలాంటి పాములు మనుషులు ఏమైనా హాని చేస్తారేమో అనే కంగారులో కాటు వేస్తాయి.అలాగే మనుషులు కూడా తమను కాటు వేస్తాయనే భయంతో పాములను చంపేస్తున్నారు.
ఇలా మనిషికి పాములకు మధ్య ఉన్న భయాన్ని పోగొట్టటానికి మన పెద్దవారు ఇటువంటి భక్తి మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పవచ్చు.మనిషి మనుగడకు సాయపడే పాము జాతి అంతరించకుండా చేయటమే ఈ ఆచారం వెనక పరమార్ధం అని చెప్పవచ్చు.