అమెరికాలో(America) ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఓ జర్మన్ వ్యక్తికి (German man)ఊహించని కష్టం వచ్చింది.ఇతడి పేరు ఫాబియన్ స్మిత్(34)(Fabian Smith).
లక్సెంబర్గ్ వెళ్లి తిరిగి వస్తుండగా, ఈ వ్యక్తికి లాగన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగ్భ్రాంతికరమైన అనుభవం ఎదురైంది.అతడి దగ్గర చెల్లుబాటు అయ్యే గ్రీన్ కార్డ్ ఉన్నా సరే, మార్చి 7న అతన్ని అధికారులు అడ్డుకున్నారు.
దేశంలోకి అడుగు పెట్టనివ్వకుండా నేరుగా కస్టడీలోకి తీసుకున్నారు.

న్యూ హాంప్‌షైర్‌లో (New Hampshire)తన పార్ట్‌నర్‌తో కలిసి ఉండాల్సిన ఫాబియన్‌ను ఇలా నిర్బంధించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కి గురయ్యారు.ఆ తర్వాత అతడిని కొట్టారని, బట్టలు విప్పదీసి, దారుణంగా ప్రశ్నించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఆపై రోడ్ ఐలాండ్‌లోని డొనాల్డ్ డబ్ల్యూ వ్యాట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారని తెలుస్తోంది.
ఫాబియన్ కోసం అతని పార్ట్‌నర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లింది.నాలుగు గంటలు ఎదురుచూసినా అతడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలు అతన్ని ఎందుకు నిర్బంధించారో తెలియక కుటుంబం కంగారుపడింది.గ్రీన్ కార్డ్ (Green card)కూడా కొత్తగా రెన్యూవల్ చేయించారని, అతడికి ఎలాంటి లీగల్ సమస్యలు లేవని వాళ్లు గట్టిగా చెబుతున్నారు.

అధికారులు మాత్రం అతడి గ్రీన్ కార్డ్‌ను “ఫ్లాగ్” చేశారని మాత్రమే చెప్పారు, కానీ ఎందుకు చేశారో చెప్పలేదు.ఫాబియన్ తల్లి ఆస్ట్రిడ్ సీనియర్ (Fabian’s mother Astrid Sr.)తన కొడుకు పడ్డ కష్టాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.బట్టలు విప్పించి, చలి నీళ్లతో స్నానం చేయించారని, తాగడానికి నీళ్లు కూడా సరిగా ఇవ్వలేదని, నీరసంతో కుప్పకూలిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌లో సమస్యలు ఉంటే ప్రయాణికులను నిర్బంధించవచ్చని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) తెలిపింది.కానీ, ఫాబియన్ కేసు గురించి మాత్రం వ్యక్తిగత గోప్యత నిబంధనల పేరుతో వివరాలు చెప్పడానికి నిరాకరించింది.
ఈ ఘటన అమెరికా ప్రభుత్వ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలపై విమర్శలకు దారితీసింది.ముఖ్యంగా ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన నిబంధనలపై మండిపడుతున్నారు.ఫాబియన్ కుటుంబం ఇప్పుడు న్యాయం కోసం, అతడి విడుదల కోసం పోరాడుతోంది.