అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) తన దూకుడు నిర్ణయాలతో ప్రపంచానికి షాకుల మీద షాకులిస్తున్నారు.అమెరికాలో పుట్టే విదేశీయుల పిల్లలకు పౌరసత్వంపై నిషేధం, ఉక్రెయిన్‌తో తెగతెంపులు, వాణిజ్య యుద్ధం, సుంకాల పెంపు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, పలు దేశాలకు అందుతున్న అమెరికా సాయంలో కోత, అక్రమ వలసదారుల బహిష్కరణ.
ఇలా ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచంపై నేరుగా ప్రభావం చూపుతోంది.తాజాగా ఆయన తన ఫోకస్ మాజీ అధ్యక్షుడు , తన ప్రత్యర్ధి జో బైడెన్‌పై( Joe Biden ) పెట్టారు.
బైడెన్ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను సమీక్షిస్తూ వాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.తాజాగా బైడెన్ పిల్లలకు సీక్రెట్ సర్వీస్ రక్షణను( Secret Service Protection ) తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన ఆదేశాలు జారీ చేశారు.బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు రక్షణకు 18 మంది, కుమార్తె ఆష్లే బైడెన్‌కు 13 మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పనిచేస్తున్నారని వీరందరినీ వెంటనే తొలగిస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అమెరికాలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.మాజీ అధ్యక్షుడు , వారి జీవిత భాగస్వాములకు జీవితకాలం సీక్రెట్ సర్వీస్ రక్షణ ఉంటుంది.అయితే వారి సంతానానికి గనుక 16 ఏళ్లు దాటితే మాత్రం అధ్యక్ష కార్యాలయాన్ని వీడిన వెంటనే భద్రతను తొలగిస్తారు.అయితే అమెరికా అధ్యక్షుడిగా దిగిపోయే ముందు తన సంతానానికి ప్రయోజనం చేకూర్చేలా ఈ రక్షణను జూలై వరకు పొడిగించారు బైడెన్.
ట్రంప్ కూడా తాను తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన పిల్లల కోసం ఇలాగే నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు.బైడెన్ అధ్యక్షుడిగా దిగిపోయే ముందు ఆటోపెన్‌తో సంతకాలు చేసి పలువురికి క్షమాభిక్ష పెట్టారని వాటిని రద్దు చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.డిసెంబర్ 12 , 2024 నాడు ఒకే రోజున దాదాపు 1500 మంది ఖైదీలకు శిక్షలను తగ్గించడంతో పాటు 39 మందికి క్షమాభిక్ష పెట్టారు.
అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ కూడా ఈ స్థాయిలో క్షమాభిక్షలను ఎవరూ ప్రసాదించలేదు.ఆటోపెన్ అంటే మానవ ప్రమేయం లేకుండా సంతకాలు చేసే ఒక పరికరం.దశాబ్ధాలుగా అమెరికా యంత్రాంగం ఈ పరికరాన్ని వినియోగిస్తుంది.