త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) దేశవ్యాప్తంగా మరోసారి తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు బిజెపి అగ్రనేతలు.అందుకే అన్ని రాష్ట్రాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
ముఖ్యంగా తెలంగాణ లో గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే విధంగా వ్యవహారచన చేస్తున్నారు.గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలను బిజెపి( BJP ) గెలుచుకుంది.
అదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలే కాకుండా ఐదారు స్థానాల్లో అయినా అదనంగా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది.దీని కనుగుణంగానే బిజెపి అగ్రనేతలు మొదలుపెట్టారు.
వరంగల్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, మల్కాజ్ గిరి, మహబూబాబాద్ స్థానాల్లో ఈసారి బిజెపి జెండా ఎగురవేయాలని చూస్తున్నారు.
ఈ స్థానాల్లో తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కమలనాధులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో బిజెపి సర్వేలు చేయించినట్లు సమాచారం.ముఖ్యంగా మాదిగ, ఆదివాసీల సామాజిక వర్గం వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బిజెపికి అనుకూలత ఎక్కువగా ఉంటుందని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు.
బలమైన అభ్యర్థులను పోటీకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే అనేక సర్వేలు నిర్వహించిన బిజెపి త్వరలోనే అభ్యర్థుల జాబితా( BJP Candidates List )ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
త్వరలోనే బిజెపి అగ్ర నేతలు కొంతమంది తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నారు.2019లో గెలుచుకున్న ఎంపీ నియోజకవర్గాలతో పాటు, కొత్తగా ఐదారు నియోజకవర్గాల పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు.అక్కడ బలమైన అభ్యర్థులను పోటీకి దింపాలని చూస్తున్నారు.బిజెపిలో సరైన అభ్యర్థులు లేకపోతే ఇతర పార్టీలలోని కీలక నేతలను ఆయన పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వాలని, ఏదో రకంగా పది స్థానాలనైన తెలంగాణలో గెలుచుకోవాలని చూస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) విజయం సాధించడంతో ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపైనా ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది.దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తోంది.