గుప్తనిధులు.వీటికోసం ఎంతోమంది నిద్రహారాలు మాని పరితపిస్తూ ఎక్కడ నిధి ఉందంటే అక్కడకు వెళ్లి పిచ్చిపట్టినట్లు తవ్వకాలు జరుపుతుంటారు.కానీ తవ్వకాలు చేసిన చోటల్లా నిధి దొరుకుతుందని చెప్పలేం.కానీ వాటి గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా వారి పనేదో వారు చేసుకునే ఉపాధి కూలిలకు గుప్తనిధులు దొరికాయి.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధి తట్రకల్లుకు చెందిన ఉపాధి కూలీలు రోజు మాదిరిగానే ఆ రోజు కూడా పనికి వెల్లారు.ఎన్ఎన్పీ తండా సమీపంలో ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా మొక్కల పెంపకానికి గుంతలు తీస్తున్నారు.
అయితే ముగ్గురు కూలీలకు పురాతన నాణేలతో కూడిన కుండ లభించింది.ఈ కుండలో నాణేలు బంగారంతో పాటు ఇత్తడివి కూడా ఉన్నాయని గుర్తించారు…కథ అక్కడ ఆ ముగ్గురి దగ్గర ఆగిపోయింది.
తర్వాత పంపకాల్లో తేడాలు రావడం వలనో,మరో కారణం చేతనో ఇప్పటివరకు గుట్టుగా ఉన్న విషయం బైటకు పొక్కింది.
దీంతో ఈ నాణాల్లో కొన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మరికొన్ని నాణేలను కూలీలే పోలీసులకు స్వయంగా అప్పగించారు,మరి కొందరిని స్టేషన్కు పిలిపించి అడగ్గా వారికి దొరికిన 12 నాణేలను అప్పగించినట్లు తెలుస్తోంది.అయితే పోలీసులకు ఇచ్చిన నాణేలు ఇత్తడివని, ఇవి గతంలో పాలించిన ముస్లింల రాజుల పేరుతో ఉన్నాయని తెలిసింది.
అయితే తమకు లభించినవి ఇత్తడి నాణేలేనని…శుభ్రపరచకముందు ఒకలా…శుభ్రపరిచాక అవి మరోలా ఉన్నాయని కూలీలు చెబుతున్నారు.అయితే ఈ నాణెల కాలం బట్టి పరిశీలిస్తే ఆ కాలంలో బంగారంవి వాడుకలో ఉన్నాయో లేదో తదితర వివరాలు తెలుస్తాయి ఆ వివరాలు పరిశీలించే పక్రియలోనే ఉన్నారు అధికారులు.
అయితే తాజాగా ఉపాధి హామీ కూలీలకు దొరికిన నాణాలు…ఇటీవల పాత అమరావతిలో పర్యాటక శాఖ అధికారికి దొరికిన నాణేన్ని పోలివుండటం గమనార్హం.విదేశీయులకు అమరావతి విశేషాలను వివరిస్తుండగా అక్కడ మట్టిలో కూరుకుపోయి ఉన్న ఒక నాణెం ఆ అధికారి కంటబడింది.
దీంతో ఆయన దానిని ఆసక్తిగా వెలికితీసి పరిశీలించగా దానిపై అర్థం కాని లిపిలో అక్షరాలు ఉన్నాయి.ఆ తరువాత దానిని అక్కడే ఉన్న పురావస్తుశాఖ మ్యూజియం అధికారులకు చూపగా అది వెండితో చేయబడిన నాణెమని…దానిపై లిపి పర్షియన్ భాషలోని అక్షరాలని తెలిపారు.
ఆ నాణెం సుమారు 17వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్నారు.అయితే ఇప్పుడు దొరికిన నాణాలు ఇత్తడివని అంటుండగా వీటిపై లిపి,అమరావాతిలో దొరికిన నాణెలపై లిపి ఒక్కటే ఉన్నట్లు తెలుస్తుంది.