రాబోయే ఎన్నికల్లో తాము తప్పకుండా గెలుస్తామనే ధీమా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తం అవుతుంది.గతం నుంచి గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతూనే వచ్చింది.
ఈ గ్రూపు రాజకీయాలు ఇంకా పూర్తిగా సర్దుమనగకపోయినా, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి .బీ ఆర్ ఎస్( BRS party ) కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో మొన్నటి వరకు బిజెపి ఉన్నా, ఇప్పుడు ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమించింది.ముఖ్యంగా చేరికల విషయంలో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. బిఆర్ఎస్, బిజెపిలలోని అసంతృప్త నాయకులను సైలెంట్ గా కాంగ్రెస్ లో చేర్చుకునే వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తోంది.
మొన్నటి వరకు బిజెపి హవా నడిచింది.బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ….
భారీగా చేరికలు ఉండబోతున్నాయనే ప్రకటనలు బిజెపి నాయకులు నుంచి వినిపించాయి.
చేరికల విషయంలో ఆ పార్టీ బాగా వెనకబడిపోయింది.చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ ( Eatala Rajender )బిజెపిలోని గ్రూపు రాజకీయాలు కారణంగా సైలెంట్ అయిపోవడం, ముఖ్యంగా బండి సంజయ్ తో అంత సఖ్యత లేకపోవడం, తెలంగాణ బిజెపిలో తన గ్రాఫ్ పెరగకుండా సంజయ్ వ్యూహాలు పన్నుతున్నారనే అసంతృప్తి రాజేందర్ లో ఎక్కువ కావడం వంటివన్నీ బిజెపిలో చేరికలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.రాజేందర్ తో పాటు, బిజెపిలోని మరో కీలక నేత కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే ఈ వ్యాఖ్యలను రాజేందర్ ఖండించారు.దీంతోపాటు ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం, ఆ ప్రభావం తెలంగాణలోనూ స్పష్టంగా కనిపించడం, ఇవన్నీ బిజెపి వెనుకబాటుకు కారణం అయ్యాయి .ఇదే కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది.బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న నాయకులు , ఇటీవల కాలంలో ఆ పార్టీకి రాజీనామా చేసిన వారు బహిష్కరణకు గురైన వారంతా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడం, ఇప్పటికే కొంతమంది పార్టీలో చేరగా, మరి కొంతమంది కీలక నేతలు ఈ నెలలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడం వంటివన్నీ కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశాలుగా మారాయి.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Ponguleti Srinivasa Reddy )తో పాటు మరికొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు.అలాగే గతంలో బిజెపికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించిన తిరుగుబాటు బిఆర్ఎస్ నాయకులను కూడా ఆకర్షించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది.
ఇక ఈ నెలాఖరులు ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతుండడంతో కాంగ్రెస్ లో ఉత్సాహం రేకెత్తించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు కొద్ది నెలలు ముందే ఈ విధంగా తెలంగాణలో పరిణామాలు చోటు చేసుకోవడం పై బిఆర్ఎస్, బిజెపిలలో ఆందోళన పెరుగుతుండగా, కాంగ్రెస్ లో మాత్రం కొత్త జోష్ కనిపిస్తోంది.ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలలోకు దూరంగా ఉంటూ వస్తున్న నాయకులు సైతం ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలతో యాక్టివ్ అవుతున్నారు.