కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణించి ఏడాది పూర్తి అవుతుంది.గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈయన మరణించి నేటికి ఏడాది పూర్తి కావడంతో ఈయన మొదటి వర్ధంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించి ప్రత్యేక పూజలు చేయగా ఎంతోమంది సినీ ప్రముఖులు సైతం దివంగత నటుడు అప్పుకి నివాళులు అర్పిస్తున్నారు.
పునీత్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా మానవతా వాదిగా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేసినటువంటి పునీత్ రాజ్ కుమార్ కి కేవలం కర్ణాటకలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తెనాలిలో పునీత్ జ్ఞాపకార్థం ఏకంగా 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు.తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు.21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
ఇక ఈ విగ్రహాన్ని త్వరలోనే బెంగుళూరుకు తరలించనునట్టు తెలుస్తోంది.నవంబర్ ఒకటవ తేదీ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించనుంది.ఈ క్రమంలోనే అదే రోజున ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇక త్రీ డి టెక్నాలజీతో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తయారు చేయడం కోసం సుమారు నాలుగు నెలల సమయం పట్టిందని శిల్పులు వెల్లడించారు.ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా పునీత్ రాజ్ కుమార్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఇక నేడు ఆయన మొదటి వర్ధంతి కావడంతో ఎంతో మంది అభిమానులు ఇప్పటికే భోజనాలను ఏర్పాటు చేయడం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా తమ హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.