ఆషాడ జాతర బోనాల మహోత్సవాలకు సికింద్రాబాద్ చారిత్రక శ్రీఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయం ముస్తాబవుతోంది.జులై 17, 18 తేదీల్లో జరిగే ఈ మహోత్సవాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ ఉత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.అటు ఆలయ అధికారులు, ఇటు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
స్థానిక మంత్రి తలసాని ఎప్పటికప్పుడు ఉత్సవాల పనులను అధికారులతో సమీక్షిస్తున్నారు.
ఆలయాన్ని రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించనున్నారు.
మరోవైపు విద్యుద్దీపాలంకరణతో ఆలయం కళకళలాడనుంది.ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బాటా, అంజల థియేటర్, మహంకాళీ ఠానా, రాణిగంజ్ కూడలి తదితర ప్రాంతాలవారు ఎల్ఈడీ ముఖద్వారాలను ఏర్పాటుచేయనున్నారు.బాట నుంచి ఆలయం, రాంగోపాల్‌పేట ఠాణా నుంచి ఆలయం, ఆలయంలోని నలు వీధుల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు.
క్యూలైన్లలో భక్తులకు వర్షంలోనూ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.ఆషాడ జాతరలో శుక్రవారాలు ప్రత్యేకం.
జాతరకు ముందు రెండురోజుల వ్యవధితో వచ్చే మూడో శుక్రవారాన్ని భక్తులు అత్యంత విశిష్ఠంగా భావిస్తారు.మినీ జాతరగా పిలిచే జాతర ముందు శుక్రవారం సుమారు 6లక్షలమంది హాజరవుతారని భావిస్తున్నారు.
ఇప్పటికే ఇతర ఆలయాల నుంచి సిబ్బందిని తీసుకుని సేవలందిస్తున్నారు.
బోనంతో వచ్చే ప్రతి మహిళ, అమ్మవారి దర్శననానికి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి తలసాని ఇప్పటికే రెండు పర్యాయాలు సమీక్ష సమావేశాలు ఏర్పాటుచేశారు.అందరి భాగస్వామ్యంతో ఉత్సవాలు విజయవంతం చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.