భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం ఎవరికీ అంతుపట్టడం లేదు.కాంగ్రెస్ ఎంపీగా, సీనియర్ నేతగా ఆయనకు ఆ పార్టీలో ప్రాధాన్యం ఉంది.
అలాగే పార్టీ హైకమాండ్ సైతం ఆయనను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వస్తోంది.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి మొదలు కావడంతో పాటు, ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరకపోవడం, సీనియర్ గా ఆయనకు ఈ విధమైన గౌరవమర్యాదలు అందుతున్నాయి.
అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై ఆయన ఆశలు పెట్టుకున్నారు.అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కనపెట్టి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడం పై తీవ్రస్థాయిలో ఆయన అసంతృప్తికి గురయ్యారు.
ఒక దశలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన మాత్రం రాజీనామా చేయకుండా తన అసంతృప్తిని సందర్భం వచ్చినప్పుడల్లా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.
ఇటీవల రేవంత్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసినా, తాను రాలేనని ఆయన చెప్పడం, తర్వాత సభా వేదికను మార్చడం వంటివి జరిగాయి.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సభకు హాజరు కావాల్సిందిగా ఆయన సతీమణి అనేక పార్టీల నేతలకు ఆహ్వానం పంపించారు.ఈ విధంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఆహ్వానం అందింది.
అయితే పార్టీ నేతలెవరూ ఆ సమావేశానికి వెళ్ళకూడదు అని ఆదేశాలు జారీ చేసినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఆ సమావేశానికి వెళ్లడం పెద్ద దుమారమే రేపుతోంది.పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా సభకు వెళ్లడమే కాకుండా , సొంత నేతలపైనా విమర్శలు చేయడం వంటి వ్యవహారంపై రేవంత్ సీరియస్ గా ఉన్నారు.ఈ పరిణామాలతో పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారానికి చెక్ పెట్టాలని అభిప్రాయపడుతున్నారట.