చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.
నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు కంటారు.
అయితే అన్ని దేశస్తుల కంటే భారత్, చైనాలకు చెందిన వారే అమెరికాలో ఎక్కువగా అడుగుపెడుతున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం 2020లో అమెరికాలో యాక్టివ్‌గా వున్న విదేశీ విద్యార్ధుల్లో భారత్, చైనాలకు చెందిన వారు 47 శాతం మంది వున్నారు.
కోవిడ్ మహమ్మారి విదేశీ విద్యార్ధుల రాకపై గణనీయమైన ప్రభావం చూపింది.తగ్గుతూ పెరుగుతూ.
ఓ పట్టాన ఏ మందులకు లొంగక కొత్త వేరియంట్లతో వైరస్ విరుచుకుపడుతూనే వుంది.ఈ నేపథ్యంలో తమ పిల్లలను అగ్రరాజ్యానికి పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతుండగా.
అటు వివిధ వేరియంట్ల కారణంగా వీసాల మంజూరుకు అమెరికా సైతం భయపడుతోంది.అయితే ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లోనూ భారతదేశంపైనా, మన విద్యార్ధులపైనా అభిమానాన్ని చాటుకుంది.
కోవిడ్ విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలోనూ తమదేశానికి వచ్చే భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.ఈ ఏడాది (2021) ఇప్పటికే దాదాపు 55వేలకు పైగా విద్యార్థులకు వీసా మంజూరు చేశామని తెలిపారు.
ఇక ప్రతిరోజు అనుమతి పొందుతున్న వీసాల్లో విద్యార్థులవే ఎక్కువగా ఉంటున్నాయని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఈ సందర్భంగా అమెరికా దౌత్యవేత్త అతుల్ కేశప్ మీడియాతో మాట్లాడుతూ.
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా వీసాల ఇంటర్వ్యూ ప్రక్రియ రెండు నెలల పాటు వాయిదా పడిందన్నారు.నిజానికి మే నెలలో మౌఖిక పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ జులై నెలలో మొదలుపెట్టామని అతుల్ చెప్పారు.
విద్యార్థులు సెమిస్టర్ నష్టపోకుండా ఉండేందుకు గాను వీలైనంత వేగంగా వీసా మంజూరు ప్రక్రియను కొనసాగించామని ఆయన పేర్కొన్నారు.ఇందుకోసం అమెరికా విదేశాంగ శాఖ సిబ్బంది చేసిన కృషిని అతుల్ కేశప్ ప్రశంసించారు.
అయితే ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు పెరిగినట్లుగా తెలుస్తోంది.కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అమెరికాకు విమాన సర్వీసులు నడుస్తుండడం, ఇదే సమయంలో భారత్ నుంచి యూఎస్ వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.యూఎస్‌లోని యూనివర్శిటీల్లో తరగతులు ప్రారంభం కానుండటంతో పాటు ఇరు దేశాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లోని యూఎస్ కాన్సూలేట్ కార్యాలయాలు ఓపెన్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యంగా విద్యార్థులకు మాత్రమే వీసాలు జారీ చేస్తున్నారు.
దీంతో విద్యార్ధులు అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసులు లేకపోవడంతో టికెట్ల రేట్లను ఆపరేటర్లు అమాంతం పెంచేశారు.సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి యూఎస్ వెళ్లేందుకు ఎకానమీ తరగతి టికెట్ ధర రూ.60 వేలుగా ఉంటే.ప్రస్తుతం దీని ధర రూ.90 వేల నుంచి రూ.2.20లక్షల వరకూ ఉంది.అయితే, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో మాత్రం ఈ టికెట్ ధర రూ.90 వేలుగానే వుండటం విశేషం.