కరోనా కారణంగా పలు సంస్థలు తమ ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి.ఈ నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించేందుకు సంస్థ నిర్ణయించినట్టు సమాచారం .ఈ మేరకు అమెరికా మీడియాలో విస్తృత కథనాలు ప్రచారం అయ్యాయి.కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అమెరికాలో అధిక శాతం మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు నేటికీ ఇంకా ఓపెన్ కాలేదు.
వచ్చే ఏడాది జనవరిలోనే కార్యాలయాలు పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది.ఈ సమయంలో ఇంటి నుంచే పనిచేద్దామనుకుంటున్న ఉద్యోగులకు శాశ్వతంగా ఆ సౌలభ్యాన్ని కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది.
అయితే ఈ విధానాన్ని ఎంచుకున్న వారు కార్యాలయంలోని తమ వర్క్ స్పేస్ ను వదులుకోవాల్సి ఉంటుంది.
‘కరోనా కారణంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి.
మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా పనిచేస్తున్నాం అనే అంశాల్లో కొత్త విధానాలు అవలంబించాల్సి వస్తోంది’ అని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ క్యాథెలీన్ హోగన్ తెలిపారు.తాజా లెక్కల ప్రకారం మైక్రోసాఫ్ట్ లొ మొత్తం 1.63 లక్షల మంది ఉద్యోగం చేస్తుండగా .వారిలో 96 వేల మంది అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.