ఆరు నూరైనా .నూరు.
నూట యాభై అయినా ఈ సారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు ఇష్టపడడంలేదు.అందుకే ఒక మెట్టు దిగి మరీ… పార్టీ వీడిన వారిని బుజ్జగించి పార్టీలోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
అలాగే పార్టీపై అసంతృప్తి ఉండి అంటీ ముట్టనట్టుగా ఉంటున్న వారిని కూడా జో కొడుతున్నారు.ప్రస్తుతం వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రలో బిజీగా ఉండడంతో విజయసాయిరెడ్డి పనులు చక్కబెడుతున్నారు.
కొణతాల విషయంలో మాత్రం ఏకంగా జగన్ తల్లి విజయమ్మ రంగంలోకి దిగారు.
జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కొణతాల అయన వెంటే నడిచారు.ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న కొణతాల కాంగ్రెస్ నేత బొత్ససత్యనారాయణ వైసీపీలోకి రావడంతో పార్టీ నుంచి బయటకి వెళ్లిపోయారు.దీంతో ఇప్పుడు ఎన్నికల హడావుడి మొదలవ్వడంతో … తాజాగా వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ద్వారా రామకృష్ణను తిరిగి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు విజయమ్మ .
కొణతాలను తిరిగి పార్టీలోకి తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్న వైసీపీ.ఇప్పటికే మూడుసార్లు కొణతాలను కలిసి కన్నబాబు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలోకి ఆయన వస్తే అనకాపల్లి లోక్‌సభ టికెట్‌తోపాటు, పోటీ కోసం ఆర్థికంగానూ సాయం అందిస్తామని అధిష్ఠానం ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.విజయసాయిరెడ్డి, విజయలక్ష్మి కూడా కొణతాలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి ఆహ్వానించినట్టు చెబుతున్నారు.
అయితే కొణతాల మాత్రం ఈ విషయాన్ని ఎటూ తేల్చుకోలేక తన నిర్ణయం తరువాత చెప్తా అంటూ వాయిదా వేసినట్టు సమాచారం.
కొణతాల బలమైన నేతగా ఉన్నందున అన్ని పార్టీలు ఆయనకు గేలం వేసే పనిలో ఉన్నాయి.
ఈ కోవలోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందినట్టు కొణతాల సన్నిహితులు చెప్తున్నారు.ఆయన నిజంగా పార్టీలోకి వచ్చేందుకు ఒప్పుకుంటే ఆయనకు పీసీసీ చీఫ్ పదవి కూడా ఇస్తామని కాంగ్రెస్ రాయబారం పంపిందట.
ఇక వైసీపీ అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ కొణతాల చేజారకుండా చూసుకుని వైసీపీ జెండా కప్పెయ్యాలని చూస్తోంది.కొణతాల మాత్రం ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉన్నాడు.