దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను, నిర్ణయాలను అమలు చేసి వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( YS JAGAN ) అనేక ప్రశంసలు అందుకుంటున్నారు.అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు ఈ సంక్షేమ పథకాలు నిర్ణయాలపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
అయినా జగన్ మాత్రం జనాల్లో వైసిపికి తిరుగులేని ఆదరణ లభించాలంటే ఈ సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలని భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెడుతూ, జనాల్లో వైసీపీకి ఆదరణ తగ్గకుండా చూసుకుంటున్నారు.
ఇక ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో ప్రజల్లో తమకు తిరుగు లేకుండా చేసుకునేందుకు, రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ముందు చూపుతో కొన్ని సంక్షేమ పథకాలను, నిర్ణయాలను జగన్ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆరోగ్యశ్రీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
తాజాగా ఆరోగ్యశ్రీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద ఐదు నుంచి పది లక్షల లోపు ఖర్చుతో కూడిన రోగాలకి పూర్తిగా ఉచిత వైద్యం లభించేది.అయితే కొన్ని కొన్ని వైద్యాలకు అవి సరిపోకపోవడంతో ఆ పరిధిని భారీగా పెంచారు.పాతిక లక్షల వరకు ఖర్చు అయ్యే రోగాలకు ఆరోగ్య శ్రీ( Arogyasri Scheme ) కింద ఉచిత వైద్యం అందించే విధంగా నిర్ణయం తీసుకున్నారు .ఈనెల 18న ఈ పథకాన్ని జగన్ ప్రారంభిస్తారు.పాతిక లక్షల రూపాయిలు మేరకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్య శ్రీ కొత్త కార్డులను( YSR Aarogyasri Card ) ఈనెల 19 నుంచి ప్రతి ఇంటికి పంపిణీ చేసే కార్యక్రమం ఏపీలో నిర్వహించే విధంగా అధికారులకు , ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు , అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డును అందించే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుడుతున్నారు.
ఏపీ వ్యాప్తంగా ప్రజలు తమ రోగాలను ఉచితంగా నయం చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఆర్థికంగా , మానసికంగా ఇబ్బందులు పడకుండా ఆరోగ్యశ్రీ కాపాడుతుందని జగన్ భావిస్తున్నారు.ఆరోగ్యం, విద్య ప్రతి ఒక్కరి హక్కు అని జగన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ కార్డులను అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ, పార్టీ శ్రేణులను ప్రజలకు దగ్గర చేసేందుకు జగన్ ప్లాన్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఇది తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని, జనాల నుంచి ప్రశంసలు అందడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో తమ గెలుపునకు డోకా లేకుండా ఈ సంక్షేమ పథకాలు తమను కాపాడుతాయని జగన్ అంచనా వేస్తున్నారు.