“ తమ పార్టీలోకి ఏ నాయకుడైన రావాలంటే పదవులకు రాజీనామా చేసి రావాలని ” చెప్పి జగన్ ఓ రూల్ పెట్టుకున్న విషయం తెలిసిందే.అంటే వైసీపీలోకి ఏ నాయకుడు వచ్చినా వారి పదవులకు రాజీనామా చేసి రావాలి.
అయితే జగన్ ఈ మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు.అధికారంలోకి వచ్చాక కూడా చెప్పారు.
కానీ ఎప్పుడైతే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వచ్చారో అప్పటి నుంచి ఈ నీతి వాక్యాలు బయటకు రావడం లేదు.పైగా తెలివిగా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా, అలా అని వైసీపీలో చేర్చుకోకుండా పరోక్షంగా వారి మద్ధతు తీసుకుంటున్నారు.ఇప్పుడు టీడీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు అలాగే చేశారు.వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ కుమార్‌లు టీడీపీని వీడి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా నడుస్తున్నారు.
ఇక ఇదే విషయంపై చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు.టీడీపీ నుంచి ఎవరినైనా తీసుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే తీసుకుంటామని, ఏదైనా పొరపాటు జరిగితే స్పీకర్ వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీలో జగన్ పెద్ద ఉపన్యాసమిచ్చారని, మరి ఇప్పుడు ఆ మోరల్స్ ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.పైగా స్పీకర్ కూడా ఎవరైనా సరే రాజీనామా చేసి.గెలిచి మళ్లీ రావాలని మాట్లాడారని, మరి ఇప్పుడు ఆ నీతి వాక్యాలు మళ్లీ పలకరేం ? అంటూ బాబు, జగన్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయితే జగన్ ఓ ప్లాన్ ప్రకారమే టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా, వైసీపీలో చేర్చుకోకుండా, వారి మద్ధతు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.సమాయనుకూలం బట్టి వారి చేత రాజీనామా చేయించి, ఉపఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ వైసీపీ వైపు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తారో, లేక అలాగే ఐదేళ్లు కాలం గడుపుతారో మరి చూడాలి.