దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు మునుగోడులో ముఖ్యమంత్రి కెసిఆర్ అప్రమత్తం అయినట్లు తెలుస్తుంది.త్వరలో జరగనున్న ఉపఎన్నికకు టిఆర్ఎస్ తన సహజ సిద్ధమైన దూకుడును తగ్గించి క్షేత్రస్థాయిలో ఓట్ల వేటకు పక్కా వ్యూహానికి తెరలేపింది.
కార్యకర్తలు, నాయకులే కాకుండా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ప్రచురకర్తలుగా వాడుకుంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ సైలెంట్ ఆపరేషన్ చేస్తున్నట్లు సమాచారం.విందు భోజనాలు విహారయాత్రలతో దళిత గిరిజన ఓట్లకు గురి పెట్టింది.
ముఖ్యంగా మునుగోడులో ఓటర్ల నమోదుపై టిఆర్ఎస్ పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది.అధికారులకు తగిన జాగ్రత్తలు చెబుతూ ఈ కార్యక్రమంలో ఒక కన్నేసింది.
సాధారణంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే రెండు వేలకు మించి కొత్త ఓట్లు నమోదు కావు.అలాంటిది మునుగోడు నియోజకవర్గం లో కొత్తగా ఓటు హక్కు కావాలంటూ ఇప్పటికే 23 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నియోజకవర్గంలో 2 లక్షల మంది పైగా ఓటర్లు ఉంటే కొత్తగా 23 వేల మంది ఓటు హక్కు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.ఈ దరఖాస్తులన్నీ హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే వస్తున్నాయి.
ఇవి భారతీయ జనతా పార్టీ నేతలు, సానుభూతిపరుల ఓట్లేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమానిస్తున్నారు.ఈ మేరకు కొత్త ఓట్లను సీరియస్ గా తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో జిల్లా కలెక్టర్ తో పాటు రెవెన్యూ యంత్రాంగం ప్రతిరోజు ప్రత్యేక సమావేశాలతో బిజీబిజీగా ఉంటున్నారు.
కొత్త ఓటు దరఖాస్తును బిఎల్ఓ విచారిస్తారు. టిఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు, గ్రామ మండల స్థాయి నాయకులు ప్రతి మండలంలో కుటుంబ సభ్యులతో సహా సమావేశాలు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలంగాణ సాధన రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిపై ఆట పాటలతో వ్యవహరించాలని నిర్దేశించింది.సమావేశాలకు వచ్చేవారికి వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తుంది.
ఒక్కో మండలంలో ఆత్మీయ సమ్మేళనానికి 50 లక్షల ఖర్చు చేసిందని సమాచారం.
నియోజకవర్గంలో 12,000 మంది గిరిజన ఓటర్లు ఉన్నారు.వీరిని ఆకట్టుకునేందుకు మండల కేంద్రం నుంచి విలాసవంతమైన బస్సు ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మగౌరవ భవనాల సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దళిత బంధు లబ్ధిదారులను మునుగోడుకు తీసుకువచ్చి స్థానిక దళిత ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు.
సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలాన్ని దళిత బందు పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది.ఈ మండలాల్లో ఇప్పటికే 700 మందికి యూనిట్లను మంజూరు చేసింది.మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే దళిత బంధు ప్రయోజనం పొందిన వారిని గుర్తించారు.ఇతర ప్రాంతాల్లోని లబ్ధిదారులను ఉదయాన్నే మునుగోడు లోని వివిధ గ్రామాల్లో దళిత కాలనీలకు తరలిస్తున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకంతో దబ్ది పొందడం ఈ పథకం రాబోయే రోజుల్లో దళితులందరికీ అందుతుంది టిఆర్ఎస్ ను గెలిపించాలి అంటూ వారు ప్రచారం చేస్తుండటం మరో విశేషం.