ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,( CM Revanth Reddy ) డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై పార్టీ అగ్రనేతలతో పాటు, కేంద్ర మంత్రులను కలిసి అనేక అంశాలపై చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు. నిన్న ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని( Sonia Gandhi ) రేవంత్ రెడ్డి , బట్టి విక్రమార్క కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై సోనియాతో వీరు చర్చించారు. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియా దృష్టికి రేవంత్ , భట్టి విక్రమార్క వివరించారు.
అంతకుముందే కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ తోనూ( CR Patil ) రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసిలో చేరుతుందని , దానిని శుద్ధి చేసేందుకు కేంద్రం సహకరించాలని రేవంత్ కోరారు.జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసిలో మురుగునీటి శుద్ధి పనులకు 4 వేల కోట్లు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ లతో నింపే పనులకు 6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అలాగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతోనూ( Rahul Gandhi ) రేవంత్, భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను కలిసామని,
ఎన్నికలకు ముందు ప్రజలు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్న అంశాలను వివరించామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ , గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు , రైతు రుణమాఫీ చేసిన అంశాలపై రాహుల్ కు వివరించామని విక్రమార్క తెలిపారు.వరంగల్ లో నిర్వహించనున్న రైతు రుణమాఫీ ,కృతజ్ఞత సభకు రావలసిందిగా రాహుల్ ను కోరామని భట్టి విక్రమార్క తెలిపారు.భవిష్యత్తులో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు.