ప్రస్తుతం ఎక్కడ చూసినా కృత్రిమ మేథ (ఏఐ) గురించే చర్చ.మనిషికి మించి ఆలోచిస్తూ, అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పనులు చేసే ఏఐ టెక్నాలజీతో( Artificial Intelligence ) భవిష్యత్తులో ఎన్నో విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తులో జరగబోయే నష్టం మన ఊహకు కూడా అందదని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ముందే అలర్ట్ అయ్యింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఎదురయ్యే ముప్పు, టెక్నాలజీ దుర్వినియోగంపై ఫోకస్ పెట్టింది.
దీనిలో భాగంగా శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,( President Joe Biden ) ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు( Kamala Harris ) అగ్రశ్రేణి టెక్ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.
వీరిలో భారత సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్( Sundar Pichai ), మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లలు( Satya Nadella ) కూడా వున్నారు.కృత్రిమ మేథతో వ్యక్తులు, సమాజం, జాతీయ భద్రతకు ముప్పు పొంచి వున్న నేపథ్యంలో దీనిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బైడెన్ చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఏఐ టూల్స్‌పై ప్రమాదకర దాడులు జరగకుండా, జాతీయ భద్రతకు ముప్పుగా మారకుండా, వీటిలో లోపాలను నివారించేలా చర్యలు చేపట్టాలని సీఈవోలను జో బైడెన్ కోరారు.ఏఐ సిస్టమ్స్ విషయంలో విధానకర్తలతో పారదర్శకంగా వుండాల్సిన అవసరాన్ని కూడా అధ్యక్షుడు ఎత్తి చూపారు.అలాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సైతం ఏఐ విపత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కృత్రిమ మేథతో తయారయ్యే ఉత్పత్తులు భద్రమేనంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమైతే ఈ విషయంలో కొత్త చట్టాలు తీసుకువచ్చేందుకు తాము సిద్ధంగా వున్నామని కమలా హారిస్ వెల్లడించారు.భద్రత, గోప్యత, పౌర హక్కుల విషయంలో ఏఐ టెక్నాలజీ ఆందోళనలకు గురిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశానికి చాట్ జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ అధినేత శామ్ అల్ట్మన్ సహా పలువురు టెక్ కంపెనీల సీఈవోలు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులివాన్, వైట్‌హౌస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.