ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నా, ఆయన మాత్రం ఈ విషయంలో ఏ క్లారిటీ ఇవ్వడం లేదు.ఒకవైపు బిజెపి , కాంగ్రెస్ లు పొంగులేటి ని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయినా పొంగులేటి మాత్రం ఇప్పటివరకు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వస్తున్నారే తప్ప , తాను ఏ పార్టీలో చేరుతున్నాననేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.అయితే ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెర దించేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
( Revanth Reddy ) ఈ మేరకు ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు.
అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోనూ( Jupalli Krishna Rao ) రేవంత్ భేటీ కాబోతున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్తాపూర్ సమీపంలోని జూపల్లి కృష్ణారావు నివాసానికి రేవంత్ వెళ్ళనున్నారు .అక్కడ ఆయనతో భేటీ అయి కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ ఆహ్వానించబోతున్నారు.ఇక అనంతరం జూపల్లిని వెంటబెట్టుకుని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి రేవంత్ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
పొంగులేటితో భేటీ అయిన తర్వాత , ఆయనను కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ ఆహ్వానించబోతున్నారట.అనంతరం రేవంత్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రాహుల్ తిరిగి ఢిల్లీకి చేరుకోనున్న నేపద్యంలో గురువారం రేవంత్ ఆయనతో సమావేశం అవుతారని, రాహుల్ తో చర్చించిన తర్వాత పొంగులేటి జూపల్లి రాహుల్ ను కలుస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాహుల్ సమక్షంలోనే పొంగులేటి అన్ని విషయాలపై క్లారిటీ తీసుకోనున్నారట.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులకి టిక్కెట్లు ఇవ్వాలని, పార్టీలో తనకు లభించే ప్రాధాన్యత వంటి అన్ని అంశాల పైన రాహుల్ సమక్షంలోనే పొంగులేటి చర్చించబోతున్నట్లు సమాచారం .నేడు రేవంత్ రెడ్డి చర్చల తర్వాత పొంగులేటి, జూపల్లి రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది స్పష్టత రానుంది.అయితే జూలై రెండో తేదీన పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.