అందరూ ఊహించినట్లే జరిగింది.అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి డెమొక్రాటిక్ పార్టీ నేత, అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) తప్పుకున్నారు.
దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని.కానీ అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో తడబడటంతో పాటు వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడం, అనారోగ్యం కారణంగా బైడెన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకోవాల్సిందిగా రిపబ్లికన్లతో పాటు సొంత పార్టీ నేతలు సైతం బైడెన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు.

స్వయంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా( Barack Obama ) సైతం.బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై పునరాలోచించుకోవాలని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట.అలాగే సీనియర్ డెమొక్రాట్, మాజీ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ( Nancy Pelosi ) అయితే ఏకంగా బైడెన్‌కే ఫోన్ చేసి తప్పుకోమని చెప్పారు.అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఈ వీకెండ్‌లో ఎన్నికల్లో పోటీపై అధ్యక్షుడు కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది.
దీనికి తగినట్లుగానే బైడెన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఆయన రేసు నుంచి వైదొలగడంతో డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి ఎవరు అన్న దానిపై చర్చ జరుగుతోంది.
అయితే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను అభ్యర్ధిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.అధ్యక్ష అభ్యర్ధిగా ఆమెకు తన పూర్తి మద్ధతు ప్రకటించారు బైడెన్.దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలావుండగా .జో బైడెన్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
బైడెన్ స్వల్పంగా దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని.ప్రస్తుతం ఆయన తన స్వస్థలం డెలావేర్‌లోని నివాసంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది.
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్‌లో ప్రచారంలో పాల్గొన్నారు బైడెన్.ఈ క్రమంలో వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో యునిడోస్ నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగి వెంటనే ఇంటికి చేరుకున్నారు.
ప్రస్తుతం బైడెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అధ్యక్షుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తారని శ్వేతసౌధం తెలిపింది.