సూర్యాపేట జిల్లా: కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి.స్వతంత్రులు జనసేకరణ లేకుండానే ప్రచారాలు నిర్వహిస్తుండగా,ప్రధాన పార్టీల అభ్యర్దులు బల నిరూపణ కోసం,అధినేతల బహిరంగ సభలకు జన సమీకరణ చేయకతప్పడం లేదు.
ప్రచారానికి,మీటింగ్ లకు జనం రావాలంటే ప్రతిరోజు పైకం కొట్టు జనాల్ని పట్టు అనే రీతిలో లోకల్ లీడర్లు చెబుతుండటంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఎన్నికలకు 20 రోజులే ఉండడంతో అవుతున్న ఖర్చుతో అభ్యర్దులు తలలు పట్టుకుంటున్నారు.
ఏ పార్టీ మీటింగ్, ప్రచారం చూసినా తండోపతండాలుగా జనం తరలిరావడంతో వచ్చిన వారంతా ఎవరికీ ఓటేస్తారో అనేది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది.ఈ నేపథ్యంలో కోదాడ నియోజకవర్గ ఓటరు నాడి సర్వేలకు సైతం అంతు పట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
గతంలో రెండు నెలల ముందు ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేసి చెప్పేవారు.
కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్షన్ తేదీకి రెండు మూడు రోజుల వరకు కానీ, ఎవరు గెలిచేది డిసైడ్ అవుతుందంటే ధన ప్రవాహం ఏ మేరకు పనిచేస్తుందో,అభ్యర్దులు ఎంత ఖర్చు పెట్టాల్సివస్తుందో అర్థమవుతుంది.
దీనిని బట్టి నేటి రాజకీయాలను డబ్బు శాసిస్తుందనడంలో అతిశయోక్తి లేదేమో? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు డబ్బు పంచు తర్వాత దోచుకో అన్న చందంగా పూర్తిగా రాజకీయాలు మారిపోయి, సామాన్యుడు ఎన్నికల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోతుందని అంటున్నారు.