మన భారత దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు కొలువై ఉన్నాయి.ఈ ఆలయాలలో వెలసిన స్వామి వారు స్వయంభుగా వెలిసి ఉండగా మరికొన్ని దేవతల చేత ప్రతిష్టించబడి ఉన్నాయి.
అలాగే మరికొన్ని మహర్షుల చేత దేవతా విగ్రహాలు ప్రతిష్టించబడి విశేష పూజలను అందుకుంటూ ఉన్నాయి.ఈ విధమైనటువంటి ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి.
ఈ ఆలయాలలో అనేక వింతలు రహస్యాలు దాగి ఉన్నాయి ఇప్పటికీ ఈ ఆలయాలలో దాగిఉన్న రహస్యాలను చేదించడం ఎవరికి సాధ్యం కాలేదు.ఇలాంటి కోవకు చెందినదే గడియాఘాట్ మాతాజీ మందిరం.
అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున గడియాఘాట్ మాతాజీ ఆలయం ఉంది.
సాధారణంగా అన్ని ఆలయాలలో దేవతలకు నూనె లేదా నెయ్యి వేసి దీపారాధన చేస్తుంటారు.కానీ ఈ ఆలయంలోని అమ్మ వారికి మాత్రం నెయ్యి,నూనె లేకుండా నీటితో దీపాన్ని వెలిగించడం విశేషం.
ఈ విధంగా నీటితో వెలిగే దీపాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటారు.దాదాపు అయిదు సంవత్సరాల క్రితం నుంచి ఈ విధంగా అమ్మవారి ఆలయంలో నీటితో మాత్రమే దీపాన్ని వెలిగిస్తున్నట్లు పండితులు చెబుతున్నారు.

ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో కూడా అన్ని ఆలయాలలో మాదిరిగానే నూనెతో దీపాన్ని వెలిగించే వారు.కానీ ఒకరోజు అమ్మవారు కలలో కనిపించి తనకు నీటితో దీపాన్ని వెలిగించాలి అని చెప్పినట్లు అక్కడి పండితులు తెలియజేశారు.అప్పటినుంచి ఈ ఆలయంలో అమ్మవారికి కేవలం నీటితో మాత్రమే దీపాన్ని వెలిగిస్తారు.అదేవిధంగా వర్షాకాలంలో అధిక వర్షం ప్రభావం కారణంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయం పూర్తిగా మునిగి పోతుంది.
అందుకోసమే ఈ ఆలయాన్ని వర్షాకాలంలో మూసివేసి తిరిగి దేవీనవరాత్రుల సమయంలో ఆలయాన్ని తెరుస్తారు.అప్పటి వరకు ఈ ఆలయంలోని దీపం ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది.ఇలా దీపం వెలగడం అంతా అమ్మవారి మహిమేనని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.