తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతటి మేధావో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టకపోయినా ఆయన నిర్ణయాలు సరైనవే అన్నట్టుగా ఆ తరువాత ఫలితాలు కనిపిస్తాయి.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా ఎన్ని అవమానాలు, ఎదురైనా లెక్కచేయకుండా కేసీఆర్ ముందుకు దూసుకెళ్తున్నారు.
కేసీఆర్ 2014 నుంచి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నారు.ఇక ఎక్కువ కాలం ఈ పదవిపై కెసిఆర్ కు వ్యామోహం లేదు అందుకే ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను ఎంపిక చేసి తాను జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ముందు నుంచి కేసీఆర్ వేసిన ప్లాన్.
దీనికి అనుగుణంగానే కేటీఆర్ కూడా తనను తాను నిరూపించుకుంటూ వస్తున్నారు.ప్రభుత్వంలో ను, పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే హడావుడి చాలా కాలంగా జరుగుతూ వస్తోంది.ఇప్పటికే అనేక ముహూర్తాలు ప్రచారంలోకి వచ్చాయి.దీనికి అనుగుణంగానే కేటీఆర్, కేసీఆర్ వ్యవహారం నడిచింది.అయితే ప్రతి సందర్భంలో ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూ కేటీఆర్ పట్టాభిషేకం వాయిదా పడడం జరుగుతూ వస్తున్నాయి.
తెలంగాణ రాజకీయ పరిస్థితులు అన్నీ కేటీఆర్ కు అనుకూలంగా మార్చి అప్పుడు ఆయనకు సీఎంగా బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.తెలంగాణ లో వరుసగా ఎన్నికలు వచ్చాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ , ఉప ఎన్నికలు ఇలా అన్ని ఎన్నికల ఫలితాలు కారు పార్టీకి అనుకూలంగా రావడంతో కేసీఆర్ లో మరింత ఉత్సాహం కనిపించింది.
కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక్కటే మిగిలి ఉందని అంతా అనుకుంటున్న సమయంలో, అకస్మాత్తుగా కరోనా వచ్చి పడింది.దీంతో కేసీఆర్, కేటీఆర్ ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి.కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఆదాయం కోల్పోయింది.
ఆర్థికంగా పరిస్థితులు తారుమారయ్యాయి.ఇప్పుడప్పుడే ఆ దుస్థితి నుంచి కోలుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.
ఇటువంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతాయని కేసీఆర్ భావిస్తున్నారు.అందుకే మరి కొంత కాలం పాటు ముఖ్యమంత్రిగా తానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో కేటీఆర్ సీఎం అయ్యే యోగం ఇప్పుడప్పుడే లేనట్టు కనిపిస్తోంది.