మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చేసే ప్రతి కార్యం వెనుక ఎంతో అర్థం, పరమార్థం దాగి ఉంటుంది.అందుకోసమే ప్రతి ఒక్క కార్యాన్ని ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగానే మన ఇంట్లో చేసే పెళ్లి కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు అడుగడుగునా మనకు దర్శనమిస్తాయి.అదేవిధంగా పెళ్లి తంతు కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి తీసుకువెళ్లి అక్కడ నూతన దంపతులతో సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయించడం చూస్తుంటాము.
అయితే పెళ్లయిన నూతన దంపతులు సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లయిన కొత్త దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి ఉండాలి.
అంతేకాకుండా మనం కోరిన కోరికలు ఏ ఆటంకం లేకుండా నెరవేరాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించాల్సిందే.సాధారణంగా ఈ సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఎంతో ప్రసిద్ధమైన కార్తీకమాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.
ఆ విధంగా కార్తీక మాసంలో ఈ వ్రతం చేయడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని భావిస్తుంటారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కలయిక రూపంలో దర్శనమిచ్చే అవతారమే సత్యనారాయణ స్వామిగా కొలుస్తారు.అందుకే పెళ్లి అయిన వారి చేత సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయిస్తే వారి కొత్త జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వారి దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని, వారి మధ్య ఎలాంటి కలహాలు ఏర్పడకుండా ఆ సత్యనారాయణ స్వామి కాపాడుతాడనే ప్రగాఢ విశ్వాసం.అందుకోసమే పెళ్లి అయిన తరువాత అత్తవారింట్లో కొడుకు, కోడలు చేత ఈ సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ వ్రతం నిర్వహించేటప్పుడు ఊరి ప్రజలందరినీ ఆహ్వానించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, సత్యనారాయణ స్వామి వారి కథను వినిపిస్తారు.అదేవిధంగా కొత్త కోడలిని ఆ ఊరి ప్రజలందరికీ పరిచయం చేస్తారు.