శ్రీ కృష్ణుని జగన్మోహన రూపానికి ముగ్ధులు అవ్వని వారు ఎవరు ఉండరు.ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన వారికి ఆయన తలపై ధరించిన నెమలిపింఛం మరింత ఆసక్తిని కలగజేస్తుంది.
ప్రపంచంలో ఇన్ని రంగు రంగుల పక్షులుండగా శ్రీ కృష్ణుడు నెమలిపింఛాన్నే ఎందుకు ధరించాడో అనే ఆలోచన రావటం సహజమే.
ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మురళిని వాయించడం ప్రారంభించాడు.
శ్రీ కృష్ణుని మురళీ గానానికి అక్కడి ప్రకృతి మొత్తం మైమరచి పోయింది.గోవర్ధన గిరి ప్రవశంమయింది.
మురళీ లోలుని సమ్మోహన సంగీతానికి అక్కడ ఉన్న నెమలులన్నీ ఆయన చుట్టూ చేరి తన్మయంగా వింటూ నిలిచిపోయాయి.శ్రీ కృష్ణుడు మురళి వాయిస్తూ నాట్యం చేయసాగాడు.
ఆయన అడుగులు చూస్తూ నెమళ్లు నాట్యం నేర్చుకోవటం ప్రారంభించాయి.ఆ దివ్య మురళీ గానం ముగిశాక నెమళ్లన్నీ కలిసి స్వామికి నమస్కరించి, ‘స్వామీ మాకు నీవు అత్యద్భుతమైన నాట్యాన్ని నేర్పించావు.
నీవు మాకు గురువువి.గురుదక్షిణగా మా నెమలి పింఛాలను స్వీకరించండి.
’ అని ఆ కృష్ణపరమాత్ముని పాదాల ముందు తమ పింఛాలను సమర్పించాయి.శ్రీకృష్ణుడు వాటి భక్తికి మెచ్చి అప్పటి నుంచి ఆ నెమలి పింఛాలను తన తలపై ధరించటం ప్రారంభించాడు.
నెమలి పింఛం దిష్టి తగలకుండా చేస్తుంది.అంతే కాకుండా శ్రీకృష్ణుడు ఓడించిన కాళీయుడనే మహా సర్పాన్ని ఆయన దగ్గరకు చేరకుండా నెమలి పింఛం హెచ్చరిస్తుంది.
సర్పాలకు నెమలి శత్రువు మరియు భయానకమనే విషయం మనందరికీ తెలిసిందే కదా.