పూజా సమయంలో, మత కార్యక్రమాలు, ధ్యానం చేసేటప్పుడు అగరువత్తులు, దూపం వెలిగించడం మనం చూస్తూనే ఉంటాం.చాలా సార్లు మనం కూడా అగరువత్తులు వెలిగిస్తాం.
వీటి వల్ల కేవలం సువాసన మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటేనండోయ్.అగరువత్తుల పొగ వెనక ఓ శాస్త్రీయ దృక్పథం ఉంది.
పూర్వ కాలం అగరువత్తుల్లో అనేక ఔషధ గుణాలు ఉండేవి.వీటిలో ప్రత్యేకత సంతరించుకున్న సాంబ్రాణి, గుగ్గిలంను ప్రస్తుతం కూడా ఉపయోగిస్తున్నారు.
బోస్వెల్లియా చెట్టు ద్రావకం నుంచి సాంబ్రాణి ఉత్పత్తి అవుతుంది.దీన్ని దూపంగా వేసినప్పుడు వెలువడే వాసనతో మెదడులోని టీఆర్పీవీ3 ప్రొటీన్ ఉత్తేజితమై మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
అలాగే చర్మానికి కూడా స్వాంతన చేకూర్చుతుంది.
గుగ్గిలం ప్రయోజనాలను గురించి అథర్వణ వేదంలో వివరించారు.
మండు వేసవిలో గుగ్గిలం వృక్షం నుంచి వెలువడే శ్రావకాల రసాయనాలను దూపానికి వాడతారు.దీని నుంచి వచ్చే దూపానికి క్రిమిసంహారక, రక్తస్రావ లక్షణాలను నిరోధించే గుణాలు ఉన్నాయి.
అలాగే చుట్టూ ఉండే గాలిని కూడా శుభ్రపరుస్తుంది.గుగ్గిలం దూపం వేసేటప్పుడు వెలువడే సువాసన మానసిక ప్రశాంతతను కలిగించి ఏకాగ్రతకు దోహదం చేస్తుంది.

అందుకే వీటిని పూజా సమయంలో వెలిగిస్తారు.వీటి వల్ల ఇంటిలోని ఏమైనా ప్రతికూలతలు ఉంటే అనుకూలంగా మారతాయి.అయితే ఎల్లప్పుడూ నాణ్యమైన అగరువత్తులు, సాంబ్రాణి, గుగ్గిలం మాత్రమే ఉపయోగించాలి.కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన నాసిరకమైనవి ఆరోగ్యానికి మరింత చెడు కలిగిస్తాయి.వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి, రక్తంలోని కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు కూడా పెరుగుతాయి.